
న్యూఢిల్లీ: కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం రూ.50 లక్షలు తీసుకుని 250 మంది చైనా దేశస్థులకు వీసా సదుపాయం కల్పించారని ఆరోపణలతో సిబిఐ కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మంగళవారం కార్తికి చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అలాగే కార్తీ తండ్రి, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. దీనిపై ట్విటర్ వేదికగా చిదంబరం అసహనం వ్యక్తం చేశారు. 'ఈ రోజు ఉదయం చెన్నైలోని మా ఇల్లు, ఢిల్లీలోని అధికారిక నివాసంలో సిబిఐ సోదాలు జరిపింది. అప్పుడు అధికారులు నాకు ఎఫ్‌ఐఆర్ చూపించారు. అందులో నిందితుడిగా నా పేరు లేదు. చివరకు అధికారులు ఏమీ గుర్తించలేదు. వేటినీ స్వాధీనం చేసుకోలేదు' అని తెలిపారు. చెన్నై సహా ముంబయి, కర్ణాటక, పంజాబ్, ఒడిశా, ఢిల్లీలో 9 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి.