May 01,2022 06:26

2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు. హిందువులారా బహుపరాక్‌. జాగ్రత్త పడండి. హిందూ మతాన్ని రక్షించుకోండి...ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్‌ లేదా హిందూత్వ శక్తులు అన్నది స్పష్టం. వీరు ఇంకా చెప్పిందేమిటి ? హిందువులు విశాల దృక్పథం కలిగిన వారు కనుకనే ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు. అదే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువులెవరైనా ఉన్నత పదవులు అధిరోహించారా చూడండి అని ప్రచారం చేశారు. మరి వీరే 2029లో ఒక ముస్లిం ప్రధాని అవుతారంటూ ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ? ఈ ప్రచారానికి ప్రాతిపదిక, లక్ష్యం ఏమిటి? మన దేశంలో రెచ్చగొడుతున్న హిందూత్వ జాతీయవాదం ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. దానిలో భాగమే 2029లో ముస్లిం ప్రధాని అనే ప్రచారం.
''ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌'' సంస్ధ సర్వే లేదా విశ్లేషణ వెల్లడించిన సమాచారం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమంలో వీడియోలు, పోస్టుల రూపంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. వాటి ప్రకారం 2041 నాటికి దేశంలో ముస్లిం జనాభా 84 శాతానికి పెరుగుతుందట. ముస్లిం జనాభా పెరుగుదల తీరుతెన్నులను పేర్కొంటూ 1948లో 6 శాతం, 1951లో 9.8, 2011లో 22.6, 2017లో 27.1 ఉందని...2021లో 32.8, 2031లో 38.1, 2037లో 43.6, 2040లో 66.9, 2041లో 84.5 శాతానికి పెరుగుతుందని...అప్పటికి హిందువుల జనాభా 11.2 శాతంగా ఉంటుందని సదరు సంస్ధ అంచనా వేసినట్లు చెబుతూ ఇంకేముంది హిందువులు అంతరించి పోతారంటూ రెచ్చగొడుతూ ప్రచారం సాగుతోంది. విద్వేష ముఠాలు తమ ఉత్పత్తులతో వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాలను ముంచి వేస్తున్నాయి.
వాస్తవం ఏమిటి? మన జనాభా లెక్కల ప్రకారం 1951లో 84.1 శాతంగా ఉన్న హిందువులు 2011లో 78.35 శాతంగా ఉండగా ఇదే కాలంలో ముస్లింలు 9.8 నుంచి 14.2 శాతానికి మాత్రమే పెరిగారు. నాలుగు దశాబ్దాల్లో పెరిగింది 5.4 కాగా, వచ్చే నాలుగు దశాబ్దాల్లో 70 శాతం ఎలా పెరుగుతారు ? అమెరికా పరిశోధనా సంస్ధ ''పూ'' వేసిన అంచనా ప్రకారం 2050 నాటికి మన దేశంలో ముస్లిం జనాభా 18.4 శాతం ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే గజం మిధ్య అన్నట్లుగా అసలు సదరు ''ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌'' సంస్ధ ఉనికి లోనే లేదని గూగుల్‌ తల్లి చెప్పినట్లు 2019 లోనే 'ఫాక్ట్‌లీ డాట్‌ ఇన్‌' సంస్ధ ప్రతినిధి వెల్లడించారు. అందువలన హిందూ మతానికి వచ్చిన ముప్పు అన్నది కూడా అవాస్తవం. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టుకొని ప్రచారం చేసే సాధ్వులు, యోగులు చెప్పేది పచ్చి అబద్ధాలే. బిజెపి ఎంపీలు పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లులను ప్రవేశపెట్టినా, వాటి గురించి ప్రచారం చేసినా ప్రచార దాడిలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయకూడదనే ప్రచారం, ఉత్తర ప్రదేశ్‌, అసోం బిజెపి ప్రభుత్వాల బిల్లులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఒక వేళ అవి చట్ట రూపం దాల్చితే 80 శాతంగా ఉన్న హిందువులే ఎక్కువ నష్టపోతారు. సాధ్వి రితంబర వంటి వారు ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కని ఇద్దర్ని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బజరంగదళ్‌కు ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దర్ని ఏం చేస్తారు, వారితో ఏమి చేయిస్తారు ? బిజెపి విధానాలను, హిందూత్వను వ్యతిరేకించే వామపక్ష, లౌకిక వాదులు, ఇతర మతాలవారి మీద దాడి చేసే మూకలుగా తయారు చేస్తారా ?
ఇక దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ప్రచారం గురించి నిజానిజాలేమిటో చూద్దాం. 2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ''నేనేం చేయాలి? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ?'' అన్నారు. 2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ''నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి'' అని చెప్పారు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఎన్నో.
1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ? ముస్లింలలో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది.
దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30 లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదు శాతమే, 95 శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌ (20 లక్షలు), మిజోరం (పది లక్షలు), మేఘాలయ (30 లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరన్నది మరొక ప్రచారం. గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54 శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21 కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబ నియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా?
2035 నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. 2017 ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికా లోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ''2035 నాటికి ముస్లిం పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది'' అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి? ప్రపంచంలో 2075 నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2035 నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వ శక్తులు ఇక్కడి ముస్లింలకు వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు.
ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే ''అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌ (విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32 లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు'' ఇది 2018లో రాజస్థాన్‌ లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

- ఎం. కోటేశ్వరరావు