Apr 07,2021 16:13

పాణ్యం/ఆదోని (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో అతిసారతో నలుగురు మరణించారు. వారిలో పాణ్యం మండలం గోరుకల్లుకు చెందిన ముగ్గురు, ఆదోనిలోని అరుణ్‌జ్యోతి నగర్‌కు చెందిన ఒకరు ఉన్నారు. గోరుకల్లుకు చెందిన యెల్ల కిట్టు (35) వాంతులు విరేచనాలతో గ్రామంలోనూ, తీవ్ర అస్వస్థతకు గురై తమ్మడపల్లి మద్దమ్మ (70) శాంతిరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారు. నంద్యాలలోని ఒక ప్రయివేటు ఆస్పత్రి నుంచి కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఉప్పరి ఉసేని (65) మరణించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అతిసారతో చనిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామంలో మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కలుషిత నీటిని తాగడం వల్లే అతిసార ప్రబలినట్లు స్థానికులు చెబుతున్నారు. నంద్యాల శాంతిరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి పరామర్శించారు. ఆదోని పట్టణంలోని అరుణ్‌ జ్యోతి నగర్‌లో కలుషిత నీరు తాగి 30 మంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారిని ఆదోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రంగమ్మ (50) మరణించింది. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జివి కృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి పరామర్శించారు. మరణించిన రంగమ్మ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలో మంచి నీటి సరఫరా అవుతున్న పైపు లైన్లు మొత్తం తుప్పు పట్టి, మురుగు కాల్వల్లోని నీరు తాగునీటి పైప్‌లైన్లలోకి చేరడంతో నీరు కలుషితమవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదోని, గోరుకల్లులో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.