Jun 21,2021 19:37

కౌలురైతులకు ఏదీ దక్కాలన్నా కీలకంగా కౌలుకార్డు
బ్యాంకు రుణం, బీమా, పంట నష్టపరిహారం అన్నింటికీ ఇదే ఆధారం
ఇచ్చేది లేదంటున్న భూయజమానులు.. చేతులేత్తేస్తున్న అధికారులు
జిల్లాలో మూడులక్షల మంది కౌలురైతులు..ఇప్పటి వరకూ 27వేల మందికే కార్డులు
గత ఏడాది పరిస్థితి మళ్లీ పునరావృతం.. ఇ-పంట నమోదులోనూ కౌలురైతుకు చుక్కెదురే

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కౌలురైతులకు మళ్లీ మొండిచేయి చూపించే పరిస్థితి కనిపిస్తోంది. సిసిఆర్‌సి (కౌలుకార్డు) జారీ మళ్లీ ప్రహాసనంగా మారుతోంది. కౌలుకార్డులిచ్చేందుకు భూయజమానులు ససేమీరా అనడంతో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటరుణాల దగ్గర నుంచి అన్నింటికీ కౌలుకార్డు కీలకంగా మారడంతో రైతులకు ఏం చేయాలో అర్థంకావడం లేదు. అధికారులు సైతం చేతులేత్తేస్తుండటంతో గతేడాది మాదిరిగానే కౌలురైతులు ఈసారి కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. చట్టంలో ప్రభుత్వం చేసిన మార్పు కౌలు రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.
జిల్లాలో మూడులక్షల మంది కౌలురైతులున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2.90 లక్షల మందికి కౌలుకార్డులు (సిసిఆర్‌సి) ఇచ్చినట్లు అధికారులు లెక్కలు సైతం చెప్పారు. కౌలురైతులకు బ్యాంకు నుంచి పంటరుణంగానీ, బీమా, పంట నష్టపరిహారం, రైతు భరోసాతో పాటు పండించిన ధాన్యం విక్రయించాలన్న అన్నింటికీ కౌలుకార్డు కీలకంగా మారింది. కానీ వైసిపి ప్రభుత్వం కౌలురైతుల చట్టంలో తెచ్చిన మార్పులు కౌలురైతులకు ఇబ్బందిగా పరిణమించాయి. భూ యజమాని అంగీకారంతో పంటసాగుదారుని హక్కుపత్రం (కౌలుకార్డు) ఇవ్వాలన్న నిబంధన రైతుల పాలిట గుదిబండగా మారింది. దీంతో 2020-21 ఏడాదికి సంబంధించి జిల్లాలో లక్షమందికి మాత్రమే కౌలుకార్డులిచ్చారు. ఇంకా రెండు లక్షల మంది కౌలురైతులకు కౌలు కార్డులు ఇవ్వలేదు. దీంతో బ్యాంకుల నుంచి పంటరుణంగానీ, బీమా, పంట నష్టపరిహారం ఏ ఒక్కటీ కౌలు రౖతులకు అందలేదు. సాగుచేయని భూయజమాని ఖాతాల్లోకి పరి హారాలు వెళ్లిపోయాయి. జిల్లా వ్యవసాయ రుణ ప్రణాళికలో పంట రుణాలకు రూ.పదివేల కోట్లు కేటాయించినా కౌలురైతులకు గతేడాది ఇచ్చింది మాత్రం కేవలం రూ.300 కోట్లు కూడా లేదు. కౌలుకార్డు లేకపోవడంతో ఇ-పంట నమోదులో కౌలురైతు పేర్లను వ్యవసా యాధికారులు నమోదు చేయడం లేదు. దీంతో పండించిన ధాన్యం అమ్ముకునేందుకు సైతం కౌలురైతులు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
మందకోడిగా కౌలుకార్డులు అందజేత
ఖరీఫ్‌ పంటకు సంబంధించి రైతులు నారుమడులు వేస్తున్నారు. కానీ ఇప్పటికీ జిల్లాలో కౌలు కార్డులు (సిసిఆర్‌సి) పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో మూడు లక్షలమంది కౌలురైతులుండగా ఇప్పటి వరకూ 27 వేల మందికి మాత్రమే కార్డులిచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భూ యజమానులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు చెతులెత్తేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఈ ఏడాది సైతం కౌలురైతులకు మొండిచేయి చూపించే పరిస్థితి కనిపిస్తోంది. భూ యజమానులు దూరప్రాంతాల్లో ఉన్న కౌలురైతులకు మాత్రమే కొంతమేర కౌలుకార్డులిస్తున్నారు. కార్డులిచ్చినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ లెక్కల్లోనూ అనేక అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. భూయజమానికి సంబంధించిన బంధువుల పేరిటనే కౌలుకార్డులు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవసాగుదారుడైన కౌలురైతుకు మాత్రం కౌలుకార్డులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఖరీఫ్‌సాగు ప్రారంభమవడంతో రౌతులకు బ్యాంకు రుణాలు అందించాల్సి ఉంది. కౌలుకార్డుల ప్రక్రియ మందకొడిగా సాగితే కౌలు రైతులకు ఏ విధంగా రుణాలు అందుతాయో అధికారులు చెబితే బాగుంటుంది. కౌలురైతులకు సంబంధించి మాటలు తప్ప చేతలు మాత్రం ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన ఖరీఫ్‌లో లక్షన్నర ఎకరాల్లో పంట దెబ్బతింది. దెబ్బతిన్న రైతులంతా కౌలురైతులే. కానీ బీమా, నష్టపరిహారం మాత్రం భూయజమానులు అందుకున్నారు. కౌలుకార్డు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులే చెబుతున్నారు. ఈ ఏడాదైనా కౌలురైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇచ్చేనా.. రుణాలు అందేనా అన్న అనుమానం నెలకొంది. కౌలుకార్డుల అందజేతపై వ్యవసాయశాఖ జెడి గౌషియాబేగంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.