Jul 29,2021 20:12

సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌

విజయనగరం : కౌలు రైతులందరికీ ఆగస్టు 15లోగా రుణాలు అందజేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌.. వ్యవసాయాధికారులను ఆదేశించా రు. ప్రతీ రైతు భరోసా కేంద్రం పరిధిలో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. గురువారం తన ఛాంబరులో పలు వ్యవసాయ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లాలో 634 వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 622 బోర్డులు ఏర్పాటు అయ్యాయని, ఇంకా 12 బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇ-క్రాప్‌ బుకింగ్‌ వేగవంతం చేయాలని, ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన శాఖల డిడిలు, ఎడిలతో పర్యవేక్షణ బందాలను వెంటనే ఏర్పాటు చేయాలని జెడికి సూచించారు. ఆర్‌బికెలలో అందించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నాణ్యతను తనిఖీలు చేయాలని తెలిపారు. సమావేశంలో ఆర్‌డిఒ భవానీ శంకర్‌, వ్యవసాయ శాఖ జెడి ఆశాదేవి, డిడిలు, ఎడిలు, ఉద్యాన వన శాఖాధికారులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలి
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ ఛార్జి కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌ ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం తదితర అంశాలపై కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్వాసితుల పునరావాసంపై దృష్టిపెట్టి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి, గూడెపువలస, కంచేరు, రావాడ, సవరివిల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణపై గ్రామాల వారీగా సమీక్షించారు. సమావేశంలో ఆర్‌డిఒ బిహెచ్‌ భవానీశంకర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, హెచ్‌వి జయరామ్‌, టిటిపిఆర్‌ ఇఇ తిరుపతిరావు, తోటపల్లి ప్రాజెక్టు ఇఇ రామచంద్రరావు, కలెక్టరేట్‌ జి.సెక్షన్‌ సూపరింటిండెంట్‌ జి.సూర్యలక్ష్మి పాల్గొన్నారు.