May 28,2023 23:39

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
టిడిపి మహానాడులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు పసుపుదళం కదిలొచ్చింది. శనివారం రాత్రి నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో చేరుకున్నారు. కొత్తపేట, ఆత్రేయపురం, పెరవలి, గోపాలపురం, చాగళ్లు నుంచి వేలాది సంఖ్యలో టిడిపి కార్యకర్తలు బైకులపై ర్యాలీగా సభా ప్రాంగణానికి వచ్చారు. ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ కావడం, ఎన్నికల మ్యానిఫెస్టోను చంద్రబాబు ప్రకటించనున్నారని తెలియడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్‌టిఆర్‌ అభిమానులు పోటెత్తారు. జోరువానను సైతం లెక్కచేయకుండా నాయకులు ప్రసంగాలను విన్నారు.
ఎంపీ రామ్మూర్తినాయుడు అధ్యక్షతన 4 గంటలకు సభ ప్రారంభమైంది. పలువురు నాయకులు ఒక్కొక్కరిగా ప్రసంగించారు. వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌, హిందూపురం ఎంఎల్‌ఎ, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో సైకో పాలనను అంతమొందించి సైకిల్‌ పాలనను తీసుకురావాలన్నారు. దీని కోసం ప్రతి కార్యకర్తా సైనికునిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మొదటి విడత మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. ఆడబిడ్డకు ప్రతి నెలా రూ.1,500, ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు ఏడాదికి రూ.20వేల సాయం, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3వేల భృతి, పూర్‌ టు రిచ్‌ వంటి పథకాలను ఆయన వివరించారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.
జాతీయ రహదారిపై కొనసాగిన రద్దీ
మహానాడు సభ నిర్వహణ నేపధ్యంలో ఆదివారమూ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. ఉదయం 8గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ప్రైవేట్‌ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో పాటు కాలినడకన సైతం తరలి వచ్చారు. జిల్లా పోలీసు అధికారులు సుమారు 25 వేల వాహనాలు వస్తాయని అంచనాలు వేశారు. అంచనాలకు తగ్గట్లుగా 10 పార్కింగ్‌ స్థలాలు అందుబాటులోకి తెచ్చారు. ఆయా పార్కింగ్‌ స్థలాలు వాహనాలతో నిలిచిపోవటంతో అత్యధిక మంది జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలను నిలిపి సభాస్థలానికి తరలివచ్చారు. జిల్లా ముఖ ద్వారాలలోతో పాటు సభా ప్రాంగణం సమీపంలోని ప్రతినిధుల సభ జరిగిన స్థలంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. దీంతో భోజనం చేసిన అనంతరం కార్యకర్తలు చెట్ల నీడన విశ్రాంతి తీసుకున్నారు.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వారు
సభా ప్రాంగణానికి బయలు దేరిన చంద్రబాబు కాన్వారు ట్రాఫిక్‌లో 30 నిమిషాల పాటు చిక్కుకుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, వారి వాహనాలతో జాతీయ రహదారి నిండిపోయింది. ఈ సమయంలో గాలి దుమారం రేగడం, జోరువాన పడటంతో ట్రాఫిక్‌కు మరింత అంతరాయం కలిగింది. దీంతో చంద్రబాబు కాన్వారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తూ చంద్రబాబు కాన్వారున ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించారు.