Oct 17,2020 06:48

శత వసంతాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు ఉద్యమం గురించి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులు, అభిమానులు చర్చించుకుంటున్నారు, ఈ నూరేళ్ళ కాలంలో ఉద్యమ ప్రస్థానంలో ముఖ్యమైన మైలురాళ్ళను స్మరించుకుంటున్నారు. ఈ ఉద్యమానికి బీజాలు వేసిన వైతాళికులను, ఉద్యమ సారథులను స్మరించుకుంటున్నారు. భారత దేశంలో సమసమాజాన్ని నిర్మించాలనే ఆశయ సాధనకు పునరంకితమౌతున్నారు.
కమ్యూనిస్టు ఉద్యమం నామరూపాలు లేకుండా పోవాలని మొదట్లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు, ఆ తర్వాత భారత పాలక వర్గాలు, వారి ప్రతినిధులు ఈ వందేళ్లుగా కోరుకుంటూనే వున్నారు, శాపనార్ధాలు పెడుతూనే వున్నారు. అయినా కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతూనే వుంది. అయితే, సోవియట్‌ సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత నయా ఉదారవాద విధానాలు ఆర్థిక రంగంలోనే గాక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సైతం పైచేయి సాధించడం, మరోపక్క మితవాద శక్తులు, మతతత్వ శక్తులు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో కమ్యూనిస్టు ఉద్యమం వెనుకపట్టు పట్టింది. ఈ వెనుకపట్టు తాత్కాలికమే.
పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదంటూ విర్రవీగిన వారంతా నేడు ఆ వ్యవస్థ సృష్టించిన సార్వత్రిక సంక్షోభాన్నుంచి బైటపడేదారి తోచక ఆ ఊబిలో అంతకంతకూ దిగబడిపోతూన్న వైనం నేడు మనం చూస్తున్నాం. గత పన్నెండేళ్ళుగా ఈ సంక్షోభం చుట్టుముట్టి వున్నా, అంతకంతకూ ప్రజల జీవితాలు దుర్భరమౌతున్నా, తమను తామే కాపాడుకోలేని స్థితిలో పెట్టుబడిదారులు పడిపోతున్నా, ఇంకా ఈ విఫల వ్యవస్థనే సమర్థించుకుంటూ, కిందపడినా నాదే పైచేయి అన్న తంతుగా వ్యవహరిస్తున్నారు పెట్టుబడిదారీ సిద్ధాంతవేత్తలు. 'కమ్యూనిస్టులు ఏం సాధించారండీ?' అని అడుగుతున్నారు. మన సమాధానం వినకుండానే 'ఏమీ సాధించలేదు' అని తీర్పు చెప్పేస్తున్నారు.
మన దేశ స్వాతంత్య్రానికి కావలిసిన అంతర్జాతీయ భూమికను ఏర్పాటు చేసింది కమ్యూనిస్టు ఉద్యమమే. ప్రపంచాన్ని మొత్తంగా తమ గుప్పెట్లో బంధించుకుని వలస పాలనను సాగించిన సామ్రాజ్యవాదాన్ని దెబ్బతీసినదెవరు? తనకెదురు లేదని విర్రవీగుతూ ప్రపంచాన్ని కబళించాలని చూసిన హిట్లర్‌ ఫాసిస్టు నాజీయిజాన్ని మట్టి కరిపించి బెర్లిన్‌ నగరంలో ఎర్రజెండాను ఎగురవేసిందెవరు? అటు ఫాసిస్టు ప్రమాదం నుంచి యావత్‌ ప్రపంచాన్నీ కాపాడడమేగాక, మూడో ప్రపంచ దేశాలపై సామ్రాజ్యవాదులు సాగిస్తున్న వలస దోపిడీ పాలనకు చరమగీతం పాడింది సోషలిస్టు రష్యా. ఆ యుద్ధంలో హిట్లర్‌ దెబ్బకు తట్టుకోలేక చతికిలబడి, చితికిన బ్రిటిష్‌ పాలకులు అనివార్యంగా వలస దేశాలపై తమ పెత్తనాన్ని వదులుకోవలసి వచ్చింది. వలస పాలనను నిర్మించింది పెట్టుబడిదారీ విధానమైతే, దానిని తుదముట్టించడానికి ప్రాతిపదిక ఏర్పరచింది కమ్యూనిస్టులు.
మన దేశంలో జాతీయోద్యమం మొదట్లో కేవలం కొద్దిమంది మేధావులకు, మధ్యతరగతికి మాత్రమే పరిమితమై ఉండేది. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలన్న డిమాండ్‌ను కూడా చేయలేని స్థితిలో ఉండేది. మనకు సంపూర్ణ స్వాతంత్య్రం కావాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. దానికి ప్రజానీకం ఉత్సాహంగా స్పందించడంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ లక్ష్యాన్ని అంగీకరించింది. అలా జాతీయోద్యమానికి లక్ష్యాన్ని నిర్దేశించడమేగాక, దానికి కండపుష్టిని కలిగించింది కూడా కమ్యూనిస్టులే. కార్మిక సంఘాలను, రైతు సంఘాలను, విద్యార్ధి, యువజన, మహిళా సంఘాలను, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా సామాన్యులంతా స్వాతంత్య్ర సాధనకు కదిలేలా చేసింది. సామాన్యుడి దైనందిన సమస్యల పరిష్కారానికి, స్వాతంత్య్ర సాధనకు గల సంబంధాన్ని విడమరిచి చెప్పి మహోద్యమానికి పునాదులు వేసింది కమ్యూనిస్టులు.
ఆనాడు గాని, ఈనాడు గాని సామ్రాజ్యవాదులను పల్లెత్తుమాట కూడా అనకుండా వారికి తాబేదారులుగా వ్యవహరిస్తూ, ఆనాటి జాతీయోద్యమంలో ఎటువంటి పాత్రనూ పోషించని ఆరెస్సెస్‌, దాని అనుబంధ శక్తులు నేడు దేశభక్తిని గురించి బోధించేందుకు సిద్ధమైనాయి. ఎంత విడ్డూరం! విభజించి పాలించాలన్న బ్రిటిష్‌ ప్రభువుల వ్యూహానికి అనుగుణంగా దేశంలో మతతత్వానికి బీజాలు వేసి ఈ దేశం మూడు ముక్కలు కావడానికి కారకులైనవారే నేడు దేశభక్తి బోధనలకు పాల్పడుతున్నారు. నేటికీ వారి విదేశీ భక్తి వీసమెత్తు తగ్గలేదనడానికి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు గాని, ట్రంప్‌కు అడుగులకు మడుగులొత్తుతున్న తీరు గాని తార్కాణాలు.
స్వతంత్ర భారత దేశంలో మత విద్వేషాలను రగిల్చి గాంధీజీని హత్య చేసింది ఆరెస్సెస్‌. ఆ సమయంలో కమ్యూనిస్టులు దేశమంతటా ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి దేశ సమైక్యత కోసం నిలిచారు. మన దేశం పారిశ్రామికంగా స్వంత కాళ్ళపైన నిలబడేందుకు తోడ్పడిన ప్రభుత్వ రంగ స్థాపనకు సహకరించినది సోషలిస్టు దేశాలే తప్ప ఏ పెట్టుబడిదారీ దేశమూ అందుకోసం ముందుకు రాలేదు. ఇప్పటికీ మన దేశం కొంతైనా స్వావలంబనను నిలుపుకొనగలిగిందీ అంటే అది ఆ ప్రభుత్వరంగ పుణ్యమే. వెన్నెముక వంటి ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ దేశాన్ని తిరిగి పరాధీనం చేయడానికి చూస్తున్నది బిజెపి ప్రభుత్వం. ఆ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోడానికి గత ముప్పై ఏళ్ళుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నది కార్మికులు తప్ప ఏ పెట్టుబడిదారుడూ కాదు. ఆ కార్మికులను బిజెపి (గతంలో కాంగ్రెస్‌) అణచి వేస్తుంటే కార్మికులకు అండగా నిలిచి ప్రభుత్వరంగ పరిరక్షణకు తోడ్పడుతోంది కమ్యూనిస్టులు.
భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడినది, సాధించినది కమ్యూనిస్టులు. అలా ప్రజా పోరాటాల ద్వారా ఏర్పడిన రాష్ట్రాల వ్యవస్థను నాశనం చేస్తున్నది బిజెపి, ఆరెస్సెస్‌ శక్తులే. తెలుగుజాతిని నిలువునా చీల్చడానికి పుణ్యం కట్టుకున్నది వాళ్ళే. విశాలాంధ్రలో ప్రజారాజ్య స్థాపన కోసం వేలాదిమంది కమ్యూనిస్టులు, సామాన్య ప్రజలు ప్రాణాలను సైతం బలిపెట్టి సాధిస్తే, ఆ త్యాగాలను వమ్ము చేసింది బిజెపి, ఇతర పాలకవర్గాలే. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు. కాశ్మీరీయులకు ఈ దేశం అంటేనే విముఖత ఏర్పడేలా చేస్తున్నారు. గతంలో ఖలిస్థాన్‌ వేర్పాటువాదం విజృంభిస్తే దానితో ఆరెస్సెస్‌ చేతులు కలిపింది. 'మా దేహాలు ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం' అంటూ వందలాది కమ్యూనిస్టులు ప్రాణాలొడ్డి దేశ సమైక్యత కోసం నిలబడ్డారు.
దేశాభివృద్ధికి తోడ్పడిన ప్రణాళికాబధ్ధ అభివృద్ధి విధానానికి ప్రేరణ కమ్యూనిస్టు దేశాల అనుభవాలే. ఆ ప్రణాళికా విధానానికే తూట్లు పొడిచి విచ్చలవిడిగా దేశాన్ని కార్పొరేట్లకు పలహారంగా సమర్పిస్తున్నది బిజెపి. ఈ విద్రోహానికి తొలుత దారి తీసింది కాంగ్రెస్‌. ప్రణాళికా విధానంతో మనం ఆహార స్వయంసమృద్థిని సాధించుకున్నాం. ఇప్పుడు బిజెపి చేసిన వ్యవసాయ చట్టాలతో దానికి తూట్లు పడ్డాయి. దున్నేవానికే భూమి పంచాలని నినదించి, దానిని అత్యంత జయప్రదంగా అమలు చేసింది కమ్యూనిస్టులు. ఆ నినాదాన్ని వ్యతిరేకించి జమీందారులకు, భూస్వాములకు అండగా నిలిచింది ఆరెస్సెస్‌.
ఆహారం ఒక సార్వత్రిక హక్కు అని ప్రకటించి, పేదలకు చౌకగా ఆహారధాన్యాలను అందించాలన్న ఉద్యమాలను నడిపింది కమ్యూనిస్టులు. ప్రజాబలానికి తలొగ్గి పాలకులు అరకొరగానైనా ప్రజాపంపిణీ విధానాన్ని చేపట్టవలసి వచ్చింది. ఇప్పుడు దానిని నీరుగార్చి ఆహార హక్కుకు బిజెపి ఎగనామం పెడుతోంది. హక్కుల కోసం, మెరుగైన జీవితాల కోసం కార్మికులు పోరాడినప్పుడు వారికి అండగా నిలిచింది కమ్యూనిస్టులు. ఆ పోరాట ఫలితాలైన చట్టాలను తుంగలో తొక్కింది మాత్రం బిజెపి.
దేశంలో ఇందిరాగాంధీ హయాంలో నియంతృత్వం అమలు జరిగినప్పుడు దానిని ప్రతిఘటించి దేశవ్యాప్తంగా నిర్బంధాలను అనుభవించడమేగాక, వేలాదిమంది ప్రాణాలను సైతం బలి ఇచ్చింది కమ్యూనిస్టులు. తామూ ఆ ఎమర్జెన్సీని ఎదిరించామని చెప్పుకునే బిజెపి నేడు అదే ఎమర్జెన్సీని తలపించేలా నిర్బంధ విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రాల హక్కుల్ని సైతం కాలరాస్తోంది. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోంది. ఉపాధిహామీ చట్టం, సమాచార హక్కు చట్టం, పునరావాస చట్టం వంటివి కమ్యూనిస్టుల జోక్యంతో, ఉద్యమాలతో వచ్చినవే. నేడు బిజెపి వాటినన్నింటినీ అపహాస్యం చేస్తోంది.
అధికారం చేతుల్లో వున్నా దేశంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు లాక్‌డౌన్‌ మాత్రం ప్రకటించి, పి.ఎం.కేర్స్‌ పేరుతో డబ్బులు దండుకుంది బిజెపి. దేశానికే ఆదర్శంగా కరోనా నియంత్రణలో కేరళ ముందుంది. కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో అంతర్జాతీయంగా ప్రశంసలను పొందింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా, ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులు. అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి అధికారం చేజిక్కించుకున్నాక ఆ ప్రజలనే దోచుకునేది దోపిడీ వర్గాల పార్టీలు. కష్టజీవి ఆవేదన, ఆకాంక్ష, నిరసన, ప్రతిఘటన, కమ్యూనిస్టుల రూపంలో ప్రజల ముందుకొస్తుంది. ఆ కష్టజీవులపై దోపిడీని సాగించే వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టులు పోరాడుతూనే వుంటారు. కష్టజీవుల చేతుల్లోకి ఆ అధికారాన్ని బదలాయించే వరకూ పోరాడుతూనే వుంటారు. దోపిడీ నుండి, అణచివేత నుండి, సాంఘిక వివక్షత నుండి, అన్ని రకాల అన్యాయాల నుండి మనిషి విముక్తి పొందే వరకూ కమ్యూనిస్టులు ఉద్యమిస్తూనే వుంటారు. కుల వివక్షకు, లైంగిక వివక్షకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నాటి నుంచి నేటి వరకు పోరాడుతూనే వున్నారు. ఈ మహా ప్రయాణంలో అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తిన్నా, బలహీనపడినా, ఆ ఆటుపోట్లకు కమ్యూనిస్టులెన్నడూ కుంగిపోరు. పడి, లేచే కడలి తరంగాల్లా ఉవ్వెత్తున చెలరేగి ఆశయ సాధన దిశగా ముందుకే, మున్ముందుకే సాగుతారు.