Feb 06,2023 21:26

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

కలెక్టరేట్‌: కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూట్‌ ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని, తదితర సమస్యలు పరిష్కారం కోరుతూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం వేలాదిమంది అంగన్వాడీలు ధర్నా చేశారు. ఉదయం 10గంటలకే జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అంగన్‌వాడీలు కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపారు. ఈ నిరసననుద్దేశించి ఉద్దేశించి ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సరళ కుమారి, ప్రధాన కార్యదర్శి గంట జ్యోతి మాట్లాడుతూ జిల్లాలోనే అనేక అంగన్వాడీ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల్లేవని, కొన్ని కేంద్రాల్లో విద్యుత్‌ సౌకర్యం లేక చిన్నపిల్లలు, బాలింతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్‌ సౌకర్యం ఉన్న కేంద్రాలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదన్నారు. ఐదేళ్లుగా టిఎ, డిఎలు చెల్లించలేదన్నారు. వైఎస్సాఆర్‌ సంపూర్ణ పోషణ అమలుకు కొన్ని ప్రాజెక్టుల్లో గత 6 నెలల నుంచి బిల్లులు చెల్లించలేదన్నారు. దీని వల్ల అప్పులుచేసి లబ్దిదారులకు ఆహారం వండిపెడుతున్నారన్నారని, దీంతో అంగన్వాడీలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రకరకాల యాప్‌లు తీసుకొచ్చి పనిభారం పెంచారు కానీ వేతనాలు పెంచలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సరిగా పని చేయకపోవడంతో విధుల పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఫేస్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు తప్ప తన సమస్యలను గుర్తించి వాటికి తగిన ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించే ఆలోచన చేయడం లేదని విమర్శించారు. యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ కేంద్రాల బలోపేతానికి నిధులు పెంచి అంగన్వాడీలకు ఉద్యోగభద్రత కల్పించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల పర్యవేక్షణకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఫుడ్‌ కమిషనర్‌, ఎంఎస్‌కె, తహశీల్దార్‌, ఎంపిడిఒ, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది తనిఖీ పేరిట అంగన్వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలౌతున్నారన్నారని, ఇటీవల రాజమండ్రిలో అంగన్‌ వర్కర్‌ ఆ కేంద్రంలోనే గుండెపోటుతో మరణించారని గుర్తు చేశారు. ఇప్పటికే కొన్ని చోట్లకొంత మంది అంగన్వాడీలు రాజీనామాకు సిద్ధపడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని, వేధింపులు ఆపాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాక్షులు దావాలా రమణారావు, యమ్మల మన్మధరావు, వి.ఇందిర మాట్లాడుతూ వైయస్సార్‌ సంపూర్ణపోషణ అమలు చేస్తున్నా మెనూకు తగిన విధంగా ఛార్జీలు సరుకుల క్వాంటీ పెంచలేదన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలను, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చేయాలని, పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50ఏళ్లు పెంచాలని, ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలని, 300 జనాబా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, మినీ సెంటర్లోని వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా తీసుకోవాలని, జాబ్‌ క్యాలండర్‌ నిర్ణయించాలని బకాయి జీతం వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి అమరవేణి, జిల్లా సభ్యులు దాలమ్మ, నారాయణమ్మ, రాధ, హిమప్రభ, ప్రభావతి, సత్యవతి, గౌరమ్మ, ధర్మవతి, దర్శిని, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, జిల్లాలోని వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.