
షాద్నగర్ (తెలంగాణ) : కదులుతున్న రైలును ఎక్కబోయి అదుపుతప్పి కిందపడటంతో మహిళా జూనియర్ ఆర్టిస్టు మృతి చెందిన ఘటన మంగళవారం షాద్నగర్ రైల్వేస్టేషన్లో జరిగింది. కడప జిల్లా కేంద్రంలోని సినిమా స్ట్రీట్కు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లో హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగిగా, జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. పండుగ నిమిత్తం సొంత ఊరికి వెళ్లిన ఆమె సోమవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యింది. నిన్న తెల్లవారుజామున రైలు షాద్నగర్లో ఆగింది. అయితే కాచిగూడ అనుకొని రైలు దిగిన ఆమె, కాదని తెలుసుకుని తిరిగి రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పటికే రైలు కదులుతుండటంతో అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆర్టిస్టు మరణవార్త విన్న జూనియర్ ఆర్టిస్టులు ఇది రైల్వేవారి నిర్లక్ష్యమంటూ ఆసుపత్రి ముందు కొంతసేపు ఆందోళన చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.