
ప్రజాశక్తి-ఆదోనిరూరల్
కడుపులో బిడ్డ కాళ్లతో తంతుంటే ఆనందపడాల్సిన తల్లి ఆవేదన చెందుతోంది. 'అమ్మా' అని పిలిపించుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్న తల్లికి 'లేవు.. ఇప్పుడు కాదు.. తర్వాత రండి' అనే మాటలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆదోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రిలో సోమవారం స్కానింగ్ పరీక్షలకు వచ్చిన గర్భిణులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం వచ్చే గర్భిణుల ఆవేదన మాటలకందనిది. కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడని తెలుసుకోవడానికి, చికిత్స అందించడానికి ముఖ్యమైంది స్కానింగ్. బిడ్డ లోపల ఎలా ఉన్నాడో అని తెలుసుకోవడానికి చేసే స్కానింగ్ కోసం రోజుల తరబడి ఆస్పత్రి ఎదుట ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.
మూలనపడిన స్కానింగ్ పరికరాలు
ఆదోని ఆస్పత్రిలో మూడు స్కానింగ్ యంత్రాలు ఉన్నాయి. వీటిలో రెండు విద్యుత్ హెచ్చుతగ్గులతో కాలిపోయాయి. ఉన్న ఒక్క యంత్రంతోనే అందరికీ సేవలందించాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం గర్భిణులు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతినెలా ఇదే పరిస్థితి ఉన్నా వైద్యాధికారులు స్పందించడం లేదు. నాబార్డు ఆర్థిక సహాయంతో రూ.7, 8 కోట్లతో నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం పనులు పూర్తికాలేదు. పాతభవనంలో అసౌకర్యాల నడుమ కాలం గడపక తప్పడం లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలూ సరిగా లేకపోవడంతో గర్భిణుల బాధ వర్ణనాతీతం. ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో రోగుల కోసం కొన్ని సౌకర్యాలను అమర్చినప్పటికీ ముఖ్యమైన స్కానింగ్ విభాగంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మూలనపడిన స్కానింగ్ పరికరాలు, పని చేయనవే కనపడుతుంటాయి.
మూడేళ్లయినా ఎలాంటి మార్పూ లేదు
తన మొదటి బిడ్డకు కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చానని, తర్వాత రెండోకాన్పు కోసం ఇప్పుడు మళ్లీ వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదని, స్కానింగ్ కేంద్రం వద్ద గర్భిణులు ఇప్పటికీ గంటల తరబడి ఎదురుచూస్తున్నారని పట్టణానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సామర్థ్యానికి తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు, పాలకులు విఫలం చెందారని, గతంలోనే గర్భిణులకు ప్రత్యేకంగా ఒక స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆస్పత్రిలో ఉక్కపోత
- ఈశ్వరి, గర్భిణీ, ఆదోని
స్కానింగ్ పరీక్షల కోసం ఆదోని ప్రభుత్వాస్పత్రికి వచ్చాం. ఇక్కడ గాలి, వెలుతురు లేక అవస్థలు పడ్డాం. కుర్చీలు సరిపోవడం లేదు. కింద కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది. తాగునీటి సౌకర్యం దూరంగా ఉంచారు. అక్కడికి వెళ్లి తాగాలంటే ఇక్కడ వరుస పోతుందని భయంతో వెళ్లలేదు. ప్రతి నెలా ఇదే పరిస్థితి. అధికారులు మాలిక వసతులు కల్పించాలి.