Feb 09,2023 00:15

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌: అత్యవసర విమాన ల్యాండింగ్‌, రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి, సర్వీసు రోడ్డు ఏర్పాట్లపై డిల్లీలో కేంద్ర, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ జైరాం గడ్కరీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ గిద్దలూరులో రాచర్ల రైల్వే గేటు వద్ద రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ఒఆర్‌ఒబికి సిఆర్‌ఐయఫ్‌ నిధులు మంజూరు చేయాలని కోరారు. సి.ఎస్‌. పురం మండలం అంబవరం గ్రామం వద్ద ఉన్న శ్రీ భైరవేస్వరస్వామి దేవస్థానానికి వెళ్లేందుకు భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బెంగళూరు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నుంచి దేవస్థానం వరకు 3 కిలోమీటర్ల సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. చిలకలూరిపేట - నెల్లూరు సెక్షన్‌ లో శింగరాయకొండ వద్ద నిర్మాణంలో నున్న ఎమర్జెన్సీ లాండింగ్‌ ఫెసిలిటీ కి సంబంధించి మైనర్‌ బెండ్స్‌ (చిన్న వంకలు), కర్వ్‌ (మలుపు)లను సరిచేసి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రైల్‌ ఓవర్‌ బ్రిడ్జికి సిఆర్‌ఐఎఫ్‌ నిధులు మంజూరుకు, బెంగళూరు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నుంచి శ్రీ భైరవేస్వరస్వామి దేవస్థానం వరకూ మూడు కిలోమీటర్ల సర్వీసు రోడ్డు ఏర్పాటుకు, శింగరాయకొండ వద్ద ఎమర్జెన్సీ లాండింగ్‌ ఫెసిలిటీ పూర్తి చేసేందుకు నిధులు మంజూరుకు చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు.