Jun 10,2021 19:51

న్యూఢిల్లీ : ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సిఎం జగన్‌ ఇవాళ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమైన జగన్‌.. పోలవరంపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును 2022 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రాజెక్టు పెరిగిన రూ.55,656.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని కోరారు. రీయింబర్స్‌మెంట్‌కు కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దని, పోలవరం స్టాకింగ్‌ పనుల పర్యావరణ అనుమతులు పూర్తి చేయాలని కోరారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో జగన్‌ సమావేశమయ్యారు. రాత్రి 9 గంటలకు హోం మంత్రి అమిత్‌షాను కలవనున్నారు. రేపు ఉదయం వాణిజ్య, రైల్వే, పెట్రోలియం శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. సిఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, మోపిదేవి వెంకటరమణ సహా మరికొందు ఎంపిలు ఉన్నారు.