Sep 15,2021 22:06

- సెప్టెంబర్‌ 27 బంద్‌ను జయప్రదం చేయాలి
- మచిలీపట్నం సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి

రెండో సారి పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు పూనుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. పోరాటాల ద్వారానే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టలమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్న బంద్‌లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం కృష్ణాజిల్లా తూర్పు కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నం ఇంగ్లీషుపాలెంలోని షాదీఖానాలో సభ నిర్వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్‌ రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మధు మాట్లాడుతూ కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్‌లుగా మార్చేసిందన్నారు. దేశ పురోభివృద్ధికి దోహదపడిన లాభాలొచ్చే ప్రభుత్వ రంగ సంస్ధలనుసైతం ప్రయివేటీకరిస్తోందని, ఆస్తుల మానిటైజేషన్‌ పేరుతో రోడ్డు, రైల్వేలు, సేవలను సమస్తం లీజులకు కట్టబెడుతోందన్నారు. దీంతో రవాణా చార్జీలు, ఇతర సేవల ఖరీదు రెట్టింపు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో ఒప్పటికే జిఎస్టీ పేరుతో ప్రజలపై విపరీత భారాలను మోపిందన్నారు. అయిల్‌, గ్యాస్‌ ధరలను రోజు రోజుకు పెంచుకుంటూ పోతోందన్నారు. మరోపక్కన మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ మైనార్టీల హక్కులకు వ్యతిరేకంగా లౌకిక తత్వాన్ని దెబ్బతీసేలా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. ఫెడరల్‌ స్పూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ వ్యవసాయం, పోర్టులు, విద్యుత్‌, తదితర రంగాలను కేంద్రం తన చేతిలోకి తీసుకుంటున్నా రాష్ట్రంలోని అధికార వైఎస్సార్‌సిపి, ప్రతిపక్ష టిడిపిలు మాట్లాడటం లేదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలన్నిటికి తలూపుతున్నాయన్నారు. సిపిఎం, వామపక్షాలు మాత్రమే నికరంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నాయన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్రిపురలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, కార్యాలయాలపైన బిజెపి దాడులకు పూనుకుంటోందన్నారు. బిజెపి విద్యారంగంలో తీసుకు వచ్చిన మార్పులతో ప్రభుత్వ విధానాలతో అంగన్‌వాడీలను వ్యవస్థ ధ్వంసం అవుతోందన్నారు. పాఠశాలలు విద్యార్ధులకు దూరం అవుతున్నాయన్నారు. ప్రయివేటీకరణతో ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని, వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే ఉపాధి పథకం నిధుల్లోనూ కోతపెట్టిందన్నారు. సిపిఎం కృష్ణాజిల్లా తూర్పు కమిటీ కార్యదర్శి ఆర్‌.రఘ, జిల్లా కమిటీ సభ్యులు పిన్నమనేని విజయ తదితరులు పాల్గొని ప్రసంగించారు.