Sep 23,2022 00:00

రైతులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు నాయినబాబు

ప్రజాశక్తి-అనకాపల్లి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం దేశ రక్షణ భేరి కార్యక్రమం చేపట్టినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 26న అనకాపల్లి ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ వద్ద జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రక్షణ భేరి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, చిన్న నాలుగు రోడ్ల జంక్షన్‌, మెయిన్‌ రోడ్డు మీదుగా రింగ్‌ రోడ్డు వరకు గురువారం ప్రదర్శనగా వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలపై ఆర్థిక భారాలు మోపిందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసిందని, నిరుద్యోగ పెరిగిందని, నూతన విద్యా విధానం పేరుతో పేదలకు విద్యను దూరం చేసిందని, కార్మిక చట్టాలపై వేటు వేసిందని, దేశ సంపదను కార్పొరేట్లు అంబానీ, అదానీకి కట్టబెడుతుందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరించి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. కేంద్రం ఒత్తిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు, ఆర్టీసీ ఛార్జీలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, మండల కన్వీనర్‌ గంట శ్రీరామ్‌, నాయకులు మళ్ల సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, భీశెట్టి అప్పారావు, నూక అప్పారావు, కాపుశెట్టి అప్పారావు, తేలయ్య బాబు, సుభాషిణి, తాతబాబు పాల్గొన్నారు.
బిజెపి గద్దె దిగితేగాని దేశానికి రక్షణ ఉండదు
కె.కోటపాడు : కేంద్రంలో మోడీ ప్రభుత్వం గద్దె దిగితేగాని దేశానికి దేశ ప్రజలకు రక్షణ ఉండదని సిపిఎం జిల్లా గండి నాయిని బాబు అన్నారు. మండలంలో సింగన్నదొరపాలెం గ్రామంలో దేశ రక్షణ భేరి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తూ వాటికి రాయితీలిచ్చి, సామాన్య మధ్య తరగతి పీల్చిపిప్పి చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఎర్ర దేవుడు, వనము సూర్యనారాయణ పాల్గొన్నారు.
బహిరంగ సభ పోస్టర్‌ ఆవిష్కరణ
అచ్యుతాపురం : కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న అనకాపల్లి ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ వద్ద జరుగు దేశ రక్షణ బేరి బహిరంగ సభ వాల్‌ పోస్టర్‌ను మండలంలోని పూడిమడక గ్రామంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రొంగలి రాము మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూడిమడక శాఖ కార్యదర్శి చౌడుపల్లి అప్పారావు, చేపల తాతయ్య, గనగల నూకరాజు, నాగేష్‌, కృష్ణ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.