Oct 17,2020 23:03
కేంద్రానికి షాక్‌... విద్యుత్‌ చట్టం రూల్స్‌ మార్చొద్దు: సిఇఆర్‌సి లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఒకదాని తరువాత ఒకటిగా వివిధ స్వతంత్ర, రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేసి, వాటి స్ఫూర్తిని దిగజారుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తాజాగా కేంద్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (సిఇఆర్‌సి) నుండి గట్టి షాక్‌ తగిలింది. విద్యుత్‌ చట్టం(2003) రూల్స్‌ను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రతిపాదనలను ఏకపక్షమైనవిగా కమిషన్‌ పేర్కొంది. కేంద్రం తన పరిధి దాటరాదని హితవు పలికింది. రూల్స్‌ మార్పు ప్రతిపాదన నుండి వెనక్కి తగ్గాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు సిఇఆర్‌సి ఎనిమిది పేజిల లేఖ రాసింది. ఛైర్‌పర్సన్‌ అనుమతితో కార్యదర్శి సనోజ్‌ కుమార్‌ ఝా రాసిన ఈ సుదీర్ఘ లేఖలో కేంద్ర ప్రభుత్వ పరిధి, రాష్ట్రాల హక్కులు, సిఇఆర్‌సి విధులు తదితర అంశాలను సోదాహరణంగా వివరించారు. వివిధ అంశాలకు సంబంధించి గతంలో వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించారు. వీటన్నింటి నేపథ్యంలో 'రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, కేంద్ర విద్యుత్‌ సంస్థతోనూ చర్చించి కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యుత్‌ విధానాన్ని, ఛార్జీల విధానాన్ని రూపొందించవచ్చు. వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ, విద్యుత్‌ రంగ అభివృద్ధికి ఆ విధానాలు దోహదం చేయాలి' అని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యుత్‌ చట్టంలోని వివిధ సెక్షన్లను ప్రస్తావిస్తూ కేంద్రం ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తోందో వివరించారు. 'విద్యుత్‌ చట్టం 2003లోని సెక్షన్‌ 79(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ అంశాన్నియైనా కమిషన్‌ సలహా కోసం పంపవచ్చు. సెక్షన్‌ 3 ప్రకారం జాతీయ విద్యుత్‌ విధానాన్ని, టారీఫ్‌ విధానాన్ని కేంద్రం రూపొదించవచ్చు. అదే సమయంలో 2003 విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌(3)లో పొందుపరిచిన విద్యుత్‌ పాలసీ, ప్రణాళిక, టారీఫ్‌ విధానం ఆధారంగా కేంద్ర కమిషన్‌ పనిచేయాలని పేర్కొంది. 'విద్యుత్‌ రంగ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌ సమన్వయంతో, ఒకరి పరిధులను మరొకరు గౌరవించుకుంటూ పనిచేయాలి.' అని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ సమన్వయ ఆవశ్యకతను గుర్తించాలని, విద్యుత్‌ చట్టం రూల్స్‌లో ఏకపక్షంగా ప్రతిపాదించిన మార్పులనుండి వెనక్కితగ్గాలని సూచించింది. చట్టంలోని సెక్షన్‌ 79(2) ప్రకారం ఈ సూచన చేస్తున్నట్లు తెలిపింది.

వివాదం ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ (చట్టాల్లో మార్పు, నిర్వహణ స్థితి, ఇతర విషయాలు)రూల్స్‌-2020, పంపిణీ పద్దతుల ప్రణాళిక, అభివృద్ధి, అంతర్రాష్ట్ర పంపిణీ ఛార్జీల రికవరి రూల్స్‌-2020, విద్యుత్‌ (లేట్‌ పేమేంట్‌ సర్‌ఛార్జి) రూల్స్‌-2020 పేరిటకొన్ని కీలక మార్పులను ఇటీవల ప్రతిపాదించింది. వాటిపై అభిప్రాయాలను తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మార్పులు అమలులోకి వస్తే విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ వేగవంతం కావడంతో పాటు, సాధారణ వినియోగదారులపై పెద్దఎత్తున భారాలు పడతాయన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలకు సంబంధించిన కనీస సమాచారం కూడా సిఇఆర్‌సికి కేంద్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే సిఇఆర్‌సి కేంద్ర ప్రభుత్వ పరిధిని గుర్తు చేస్తూ తాజాగా లేఖ రాసినట్టు సమాచారం. కేంద్రం అమలు చేసే విధానాలు విద్యుత్‌ రంగ అభివృద్ధికి, విశాల ప్రయోజనాలకు దోహదం చేయాలన్న చట్టంలోని అంశాలను సిఇఆర్‌సి గుర్తు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేసినట్టయింది. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వామపక్ష పార్టీలు, విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే! న్యాయ వ్యవస్థలాంటి (క్వాజీ జ్యుడీషియల్‌) సిఇఆర్‌సి సూచన మేరకైనా కేంద్ర ప్రభుత్వం వినాశకర విద్యుత్‌ సంస్కరణల మార్గం నుండి వెనక్కు తగ్గాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.