Aug 18,2022 20:57

ఆపరేషన్‌ థియేటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా కేంద్రాస్పత్రిలో త్వరలో అధునాతన ఆపరేషన్‌ థియేటర్‌ అందుబాటులోకి రానుంది. మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌ను సుమారు రూ.2.5 కోట్ల సిఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ వే సంస్థ ముందుకొచ్చింది. పార్వతీపురానికి చెందిన స్వచ్ఛంద సంస్థ జన కల్యాణ సమాఖ్య కృషితో ఈ సంస్థ జిల్లాలో ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేస్తోంది. థియేటర్‌లో సి-ఆర్మ్‌, లాప్రోస్కోప్‌, ఎనలైజర్‌, రెండు ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మిషన్లు తదితర అత్యాధునిక పరికరాలతోపాటు అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్సు కూడా సమకూరనుంది. కేంద్రాసుపత్రిలో ఈ ఆపరేషన్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి గురువారం పరిశీలించారు. ఏర్పాటు చేయనున్న పరికరాలు, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జి.నాగభూషణరావు, జిల్లా కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.సీతారామరాజు, యునైటెడ్‌ వే, జెకెఎస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.