Jul 30,2021 06:20

     విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరించడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో గురువారం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొనడం చూస్తే విశాఖ ఉక్కు పట్ల తెలుగు ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో విదితమవుతున్నది. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అని నినదించి, ప్రాణ త్యాగాలతో తెలుగువారు సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించరాదని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా మోడీ సర్కారు మొండిగా పాత పాటే పాడడం దారుణం. ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడినప్పటి నుండి గత ఆరు నెలలుగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన సాగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బిజెపి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలూ 'ఉక్కు' ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. దశలవారీ ఉద్యమాల్లో వామపక్షాలు ముందున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడూ లేఖలు రాశారు. అన్ని వైపుల నుండి ఒత్తిడి చేస్తున్నా కేంద్రం 'నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న' చందంగా వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తిరస్కరించడమేగాక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణానికి నిధుల మంజూరుకు కేంద్రం మొండి చెయ్యి చూపుతోంది. సర్వస్వం త్యాగం చేస్తున్న నిర్వాసితుల గోడు పట్టించుకోవడమే లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతో సహా విభజన హామీలన్నిటికీ మంగళం పాడేసింది. కేంద్రం అన్ని విధాలా ఆంధ్రుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది.
      'ఇది విధాన నిర్ణయం. కోర్టుల జోక్యానికి వీలు లేదు. పెట్టుబడుల ఉపసంహరణ సరైందో కాదో తేల్చే అధికారం కోర్టులకు లేదు. సంక్లిష్టమైన ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నందున ఈ విషయంలో కోర్టులకు జోక్యం చేసుకునే పరిధి లేదు.' అని కౌంటర్‌లో పేర్కొనడం కేంద్ర ప్రభుత్వానికి కోర్టులంటే కూడా లెక్క లేదని చెప్పడమే కదా! గద్దెనెక్కాం...మాకు నచ్చింది మేం చేసుకుపోతాం...ఎవరూ అడగడానికి వీల్లేదని గద్దిస్తున్నారన్నమాట! అదే సమయంలో 'రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు. ఉద్యోగులు వాటి కోసం పట్టుబట్టడానికి వీలు లేదు. కొత్త యాజమాన్యం చెప్పినట్టు విధులు నిర్వహించాలి.' అని కూడా పిటిషన్‌లో తెలిపారు. కాబట్టి ప్రైవేటీకరణ అంటేనే సామాజిక న్యాయానికి సమాధి కట్టడం అన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్టయింది. అంతేగాక 'పలు దఫాలుగా చర్చించాకే ప్రణాళికాబద్ధంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కమిటీలో ప్రధాని, హోం, ఉక్కు, ఆర్థిక, సహజ వాయువులు, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖల మంత్రులున్నారు. న్యూ పబ్లిక్‌ సెక్టర్‌ పాలసీ లో ఐరన్‌, స్టీల్‌ రంగాలు వ్యూహాత్మక రంగం లోకి రావు కాబట్టి అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది.' అని మోడీ సర్కారు తన వైఖరిని కోర్టుకు, తద్వారా ప్రజలకూ వివరించిందన్నమాట.
     అక్కడితో ఆగకుండా 'విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖ లోనే ఉంటుంది. ప్రైవేటీకరణ చేసినా అక్కడి నుంచే కొత్త యాజమాన్యం పని చేస్తుంది.' అని కేంద్రం తన కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొనడం కార్మిక వర్గాన్ని, ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని, తెలుగు ప్రజలనూ అవహేళన చేయడమే! ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజల సత్తా చూపించాలి. ఆగస్టు 4, 5 తేదీల్లో చలో పార్లమెంట్‌ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఈ ఉద్యమానికి అఖిల భారత స్థాయిలో మద్దతు సమీకరించడం ఎంతో అవసరం. అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ఉద్యోగ సంఘాల సహకారాన్ని కూడగట్టాలి. ఈ దిశగా అన్ని ట్రేడ్‌ యూనియన్లతో కూడిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షిద్దాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకూ ఐక్య ఉద్యమం సాగాలి. పోరాటాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడానికీ పోరాటమే మార్గం.