Jun 10,2021 19:40

న్యూఢిల్లీ : కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఈ సంక్షోభ సమయంలో ఆరోగ్యం, జీవనోపాధి పరంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు చేపట్టిన 10 రోజుల దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం విజయవంతమైంది. చివరి రోజైన గురువారం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 'డిమాండ్స్‌ డే' నిర్వహించారు. కరోనా సమయంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, జీవనోపాధి పరమైన సమస్యలకు సంబంధించి 13 పాయింట్లతో కూడిన డిమాండ్ల చార్టర్‌తో సిఐటియు ఈనెల 1న ఈ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. చివరి రోజు ప్రధానంగా కార్మికుల కాలనీలు, పని ప్రదేశాల్లో కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా ఈ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. కరోనా కట్టడిలో మోడీ సర్కార్‌ వైఫల్యానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లోపభూయిష్టమైన, విధానపరమైన నిర్ణయాలను నిరసించారు. కార్పొరేట్ల లబ్ధి కోసం కేంద్రం ప్రజల ప్రాణాలను బలిపెడుతోందని విమర్శించారు.


ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ న్యూస్‌క్లిక్‌తో మాట్లాడుతూ.. 10 రోజులపాటు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం విస్తృతంగా నిర్వహించామని తెలిపారు. బ్లాక్‌ లెవల్‌ వరకు ఆందోళనలు, ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయన్నారు. ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వ్యాక్సిన్‌ విధానంలో కేంద్రం మార్పులు చేసిందని, ఇది ప్రజా విజయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు రూ.7,500 ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని, రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా అవసరమైన ప్రతి కుటుంబానికి ఆరు నెలల పాటు నెలకు 10 కేజీల ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని సిఐటియు డిమాండ్‌ చేస్తోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని పేర్కొంది.


10 రోజుల దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. హర్యానాలో నిర్మాణ రంగ కార్మికులు, ఆశాల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు జరిగాయి. సిఐటియు ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ ప్రధాన కార్యదర్శి అనురాగ్‌ సక్సేనా మాట్లాడుతూ.. నోయిదా, ఘజియాబాద్‌ ప్రాంతాలతోపాటు దేశ రాజధాని పరిధిలోని 40 నుంచి 50 ప్రాంతాల్లో గురువారం ఆందోళనలు జరిగాయని తెలిపారు. పలు జిల్లాల్లో డిప్యూటీ లేబర్‌ కమిషనర్లకు డిమాండ్లు ఆమోదించాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చామన్నారు.