Nov 21,2020 17:26

తిరువనంతపురం : కేరళ పోలీసు చట్ట (కెపిఎ) సవరణకు గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఆమోదం తెలిపారు. దానికి సంబంధించిన బిల్లులపై సంతకాలు చేశారు. దీంతో సోషల్‌ మీడియా ద్వారా మహిళలను, యువతులను, పిల్లలు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై విచారణ జరిపేందుకు వీలుంటుంది. ఈ సంతకంతో చట్టాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయిందని రాజ్‌భవన్‌ తెలిపింది. 2011లో చట్టంగా ఏర్పడిన కేరళ పోలీసు చట్టానికి..సెక్షన్‌ 118-ఎ అనే కొత్త నిబంధనను చేర్చి... ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్న సిఫార్సును రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్‌లో ఆమోదం తెలిపింది. దీంతో ఈ సవరణ చోటుచేసుకుంది.
ఇక సోషల్‌ మీడియా ద్వారా ఏ వ్యక్తినైనా బెదిరించడం, అవమానించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడి... అనంతరం దోషులుగా తేలితే ఐదేళ్ల జైలు, 10వేల జరిమానా విధించేలా చట్టంలో సవరణలు తీసుకువచ్చారు. యూట్యూబ్‌ చానళ్లతో పాటు పలు సోషల్‌ మీడియా వేదికల ద్వారా తమను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ కొంత మంది మహిళలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీటిని అడ్డుకునేందుకు సరైన చట్టం లేకపోవడంతో, ఇటువంటి కేసులు మరిన్ని పెరగవచ్చునని భావించిన కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం ...చట్టంలో సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు వచ్చింది. దీనికి సంబంధించి కేరళ పోలీసు చట్టంలో సవరణలు చేసి..గవర్నర్‌కు పంపగా.. ఆ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.