Jul 28,2021 20:42

మంత్రి పంకజ్‌ చౌదరీ వెల్లడి
న్యూఢిల్లీ :
బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ సంస్థ పారిస్‌లోని భారతదేశ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చంటూ ఫ్రెంచ్‌ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం నిజమేనని ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరీ తెలిపారు. ఈ విషయమై బుధవారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం నుంచి తమకు 1.72 బిలియన్‌ డాలర్ల (రూ.13 వేల కోట్లు) పరిహారాన్ని ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికా, లండన్‌, నెదర్లాండ్స్‌ న్యాయస్థానాల్లో దావాలు వేసింది. ఈ క్రమంలోనే గత నెల 11న ఫ్రెంచ్‌ కోర్టు కెయిర్న్‌ ఎనర్జీ పిటిషన్‌పై విచారణ జరిపింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు మేరకు పారిస్‌లో ఉన్న భారత ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జి సంస్థ స్వాధీనం చేసుకోవచ్చని తీర్పు వెలువరించింది.