May 05,2021 09:40
  • చీఫ్‌ జస్టిస్‌గా రమణ బాధ్యతలు స్వీకరించాక పలు మార్పులు

న్యూఢిల్లీ : జస్టిస్‌ ఎన్‌వి.రమణ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న పలు కీలక అంశాలకు సంబంధించి కొన్ని మార్పులు కనిపిస్తున్నా యి. సామాన్య ప్రజల హక్కుల సంరక్షకురాలిగా తన పాత్రలోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు పరిణామాలను చూస్తే అనిపిస్తోంది. కేరళ జర్నలిస్టు సిద్ధికి కప్పన్‌ ఉత్తర ప్రదేశ్‌ హథ్రాస్‌లో అత్యాచార ఘటనను కవర్‌ చేసేందుకు వెళ్తుండగా, అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కరోనాతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో వైద్య చికిత్స నిమిత్తం ఢిల్లీకి మార్చడంలో విముఖంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి తగిన ఆదేశాల ను సుప్రీంకోర్టు ఇచ్చింది. కరోనా రెండో దశ ఉధృతిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ లోపాల గురించి సూటిగా, నిస్సంకోచంగా మాట్లాడింది. మోడీ సర్కార్‌ హయాంలో తీవ్రంగా దుర్వినియోగమవుతున్న దేశద్రో హ చట్టం చట్టబద్ధతను పునఃపరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కాషాయ నేతల మత విద్వేష చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడే సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇతర అసమ్మతివాదుల పై ఈ చట్టాన్ని ప్రయోగించి, కేసులు పెట్టి.. అనేక మందిని జైలుపాలు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం దుర్వినియోగ మవుతున్న తీరుపై కొంతమంది న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మూడు నెలల క్రితం తిరస్కరించింది. తాజాగా, న్యాయస్థానం చట్టంలోని సెక్షన్లను పునఃపరిశీలించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ ఎన్‌వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చోటుచేసుకోవడం గమనించాల్సిన అంశం. కప్పన్‌కు ప్రత్యేక చికిత్స అవసరం లేదన్న యోగి సర్కార్‌ అఫిడవిట్‌ను పక్కనపెట్టిన ఎన్‌వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం.. జీవించే హక్కు అత్యంత విలువైన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. కప్పన్‌కు తగిన, సమర్ధవంతమైన వైద్య సాయాన్ని అందించాలని, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని భయాలను తొలగించాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో యుపి ప్రభుత్వం సమర్పించిన రిపోర్టుల్లోనే.. కప్పన్‌కు డయాబెటిస్‌, గుండె సంబంధిత అనారోగ్యం, రక్తపోటు, ఇతర గాయాలు వంటివి ఉన్నాయని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రమణ గతనెల 24న ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల ముందు తన ప్రసంగంలో ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. ప్రభుత్వం నుంచి లేదా కొన్ని సంఘ విద్రోహక శక్తుల నుంచి ఎదురయ్యే మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి సమాజంలోని బలహీన వర్గాల ప్రజలను కాపాడేందుకు చట్టబద్ధమైన సమాజం బాధ్యత వహిస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో దేశంలో అవసరమైన మెడికల్‌ వస్తువుల సరఫరా, సేవలుపై జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటాగా స్వీకరించిన సమయంలో పలువురు సీనియర్‌ న్యాయవాదులు విమర్శించారు. ఔషధాల పంపిణీ, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌, ఇతర లోపాలను పర్యవేక్షించేందుకు హైకోర్టులు చేస్తున్న ప్రయత్నాల్లో జోక్యం చేసుకునేదిగా ఉందని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్‌ సరఫరా, ఔషధాలు, వ్యాక్సినేషన్‌, ఇతర అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన ఆదేశాలివ్వడంపై న్యాయవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాబ్డే పదవీ విరమణ తర్వాత.. ఈ సుమోటో కేసు జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకెళ్లింది. హైకోర్టు పనిలో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని, కేవలం దానికి కేవలం అనుబంధంగానే ఉండాలని అనుకుంటున్నామని పేర్కొంది.
   దేశం జాతీయ విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో మౌనంగా ఉండలేమని కుండబద్దలు కొట్టింది. తరువాతి రోజుల్లో సుప్రీంకోర్టు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్లు విధించింది. ఆసుప్రతుల్లో అడ్మిషన్లకు సంబంధించి రెండు వారాల్లోగా ఒక నేషనల్‌ పాలసీని రూపొందించాలని ఆదేశించింది. అత్యవసర ప్రాతిపదికన ఆక్సిజన్‌ను అవసరమైన మొత్తంలో సిద్దం చేయడానికి, నిల్వలను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని సూచించింది. కోవిడ్‌-19 నిర్వహణలో ప్రభుత్వ లోపాలను సోషల్‌ మీడియాలో లేవనెత్తే ప్రజలను శిక్షించాలని ప్రయత్నిస్తే.. అది కోర్టు ధిక్కరణే అవుతుందని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘంపై మద్రాస్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో.. కోర్టుల వ్యాఖ్యానాలను రిపోర్టు చేయనీయకుండా మీడియాను ఆదేశించలేమని పేర్కొంది.