Oct 28,2021 11:02

హైదరాబాద్‌ : సన్‌షైన్‌ ఆసుపత్రిలో మెజార్టీ వాటాను ప్రముఖ ఆసుపత్రి కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (కిమ్స్‌) కొనుగోలు చేసింది. సన్‌షైన్‌ హాస్పిటల్స్‌లోని 51.07 శాతం వాటాను కొనుగోలు చేసుకునేందుకు కిమ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సన్‌షైన్‌ ఆసుప్రతి వ్యవస్థాపకులు, ప్రముఖ ఆర్ధోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎవి గురువారెడ్డితో పాటు ఆయన సహచర వైద్య బృందం కిమ్స్‌ ఆసుపత్రితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ వాటా కొనుగోలుతో 9 నగరాల్లో 12 ఆసుపత్రులు, 3,666 వైద్య పడకలు, 1200 మంది ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద వైద్య సేవల సంస్థల జాబితాలో కిమ్స్‌ చేరనుంది. 10 ఏళ్ల క్రితం సన్‌షైన్‌ను గురువారెడ్డి స్థాపించగా.. ఆగేసియా దేశాల్లో రెండో అతిపెద్ద జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సెంటర్‌గా అనతికాలంలో గుర్తింపు లభించింది. ఇందులో ప్రతి ఏడాది 4వేలకు పైగా మోకీలు ఆపరేషన్లు చేస్తున్నారు.
సికింద్రాబాద్‌, గచ్చిబౌలి,కరీంనగర్‌లోని సన్‌షైన్‌ ఆసుప్రతుల్లో 600లకు పైగా బెడ్స్‌ ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.411 కోట్ల ఆదాయాన్ని, రూ. 75 కోట్ల ఆపరేటింగ్‌ లాభాన్ని సంస్థ నమోదు చేసింది. రూ. 730 కోట్ల సంస్థాగత విలువ ప్రకారం ఈ ఆసుపత్రిలోని 51.07 శాతం వాటాను రూ. 362. 78 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ పేర్కొంది.