Mar 02,2021 08:49

అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక  నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. సోమవారం అర్ధరాతి జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు యువతులు, మరో ఇద్దరు యువకులు ఉన్నారు. కారు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రేఖ (21), అంచల్‌ సింగ్‌ (21), మహబూబ్‌ అలం (31), మనోజ్‌ మిట్టల్‌ (38) ఉన్నారు. మృతుల్లో ఒకరిది స్వస్థలం బెంగళూరు కాగా... మరో ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని సమాచారం. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌ నుంచి వస్తున్నట్లు తెలిసింది. వీరు ప్రయాణిస్తున్న కారు... కియా పరిశ్రమ ప్రధాన గేటు వద్దకు రాగానే... స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు వేగంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. లారీని ఓవర్ టేక్ చేయాలనుకున్న సమయంలో కారు వేగంగా దూసుకెళ్లి లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.