
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల నిర్వహణ కోసం అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి కనీసం రెండేళ్లు, గరిష్టంగా ఐదేళ్ల వరకు గుర్తింపు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అదనపు తరగతి గదుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
ఈ నెల 16 నుంచి కళాశాలలు bఱవ.aజూ.స్త్రశీఙఱఅ వెబ్సైట్ ద్వారా లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఉపయోగించి జూన్ 13వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. కళాశాలల నుంచి వచ్చిన దరఖాస్తులను బోర్డు పరిశీలిస్తుందని పేర్కొన్నారు.
పరీక్షల్లో 13 మాల్ ప్రాక్టీస్ కేసులు
ఇంటర్ పరీక్షల్లో 13 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులను ఇంటర్మీడియట్ బోర్డు నమోదు చేసింది. శనివారం జరిగిన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి జివి ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాలో ఐదుగురు, గుంటూరులో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చొప్పున మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని వివరించారు. పరీక్షకు మొత్తం 4,08,283 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 3,94,442 మంది హాజరయ్యారని వెల్లడించారు. 13,841 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. శనివారం జరిగిన పేపర్‌కు మొదటి సెట్‌ను బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు ఉదయం ఎంపిక చేశారు.