Mar 25,2023 00:19

సమావేశంలో మాట్లాడుతున్న వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రామ్మోహనరావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు నాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిడేషన్‌ కౌన్సిల్‌) గుర్తింపు తప్పనిసరి అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామ్మోహనరావు అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ కళాశాల కరస్పాండెంట్స్‌, ప్రిన్సిపాల్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలన్నీ ఏడాదిలోగా నాక్‌ అక్రిడిడేషన్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌ నాక్‌ గుర్తింపు సాధించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల సాధన కోసం మాత్రమే నాక్‌కు వెళ్లొద్దని హితవు పలికారు విద్యార్థులకు మెరుగైన సేవలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ప్రమాణాలు పాటించి జాతీయస్థాయిలో అత్యుత్తమ విద్యాసంస్థగా కళాశాలను నిలబెట్టేందుకు నాక్‌ గుర్తింపు అవసరమన్నారు. నాక్‌ గుర్తింపునకు 2017 వరకు ఒక పద్ధతి ఉండేదని, ఆ తర్వాత నాక్‌ గుర్తింపు ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులు చేసిందన్నారు. నాక్‌ గుర్తింపునకు రూ.3.5 లక్షలను ఫీజు రూపంలో చెల్లించాలన్నారు. కళశాలల సౌకర్యార్థం 45 రోజుల్లో నాక్‌ గుర్తింపునకు ఎలా సన్నద్ధం కావాలో ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు రూపొందించిందని తెలిపారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌.ఎ రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షత వహించిన సమావేశంలో ఆర్ట్స్‌, కామర్స్‌, లా ఎడ్యుకేషన్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదరుభాస్కర్‌, ఐక్యుఎసి కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.స్వప్నవాహిని, పలు కళాశాలలకు చెందిన కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.