Jan 10,2021 20:28

కళ్లంలో ఉన్న ధాన్యం బస్తాలు

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : ఈ ఏడాది పంట ఆశాజనకంగా పండింది. దిగుబడి కూడా బానే వచ్చింది. నాలుగు రాళ్లు చేతికొస్తాయన్న ఆనందం రైతుల్లో వ్యక్తమైంది. ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. ఎంతో ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. కానీ రైతు కుటుంబాల్లో పెద్ద పండగగా భావించే సంక్రాంతి దగ్గర పడుతున్నా.. ఎక్కడి నిల్వలు అక్కడే ఉన్నాయి. కొనుగోలు చేసిన వాటికి బిల్లులూ రాలేదు. అధికార యంత్రాంగం రోజుల తరబడి కాలయాపన చేస్తూ రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. పాలకులూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు పండిన ధాన్యాన్ని కళ్లాల్లో నెట్టేసి రైతులు కాపలా కాయాల్సిన పరిస్థితి వచ్చింది. సంక్రాంతి సమీపిస్తున్నా చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో రైతుల్లో దైన్యం కనిపిస్తోంది.
     పార్వతీపురం మండలంలో దాదాపు 16 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కృష్ణపల్లి, పార్వతీపురం, పెదబొండపల్లి, బందలుప్పి పిఎసిఎస్‌ల ఆధ్వర్యాన నాలుగు కేంద్రాలు ఏర్పాటుచేశారు. రెండు చోట్ల ఎఎంసి, 10 చోట్ల వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ఆధ్వర్యాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. 16 రైస్‌ మిల్లులకు అనుమతులు ఇచ్చినప్పటికీ మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాలేదు. దీంతో ధాన్యం కొనుగోళ్లు ఒక్కసారిగా మందగించాయి. అయినప్పటికీ అధికారులు ఇతర జిల్లాల మిల్లర్లతో సంప్రదించి సాధ్యమైనంత వరకూ ధాన్యాన్ని తరలిస్తున్నప్పటికీ, అది పూర్తిస్థాయిలో జరకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కానీ బిల్లులు ఎవరికీ చెల్లించలేదు. సుమారు 1300 మంది రైతులకు రూ.18.25 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. పండగ ఖర్చులతోపాటు ఇతర ఆర్థికపరమైన అవసరాల నుంచి గట్టెక్కేందుకు కొంతమంది దళారులను ఆశ్రయించి వారిచెప్పిన తూకానికే ధాన్యం అప్పగిస్తున్నారు. గతేడాది ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాదీ అదే పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. ప్రతి ఏడాది మిల్లర్లతో ఇదే సమస్యలు తలెత్తుతుండటం వల్ల అధికారులు ముందస్తుగా స్పందించి ఉంటే తమకీ కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టి, బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

పెద్ద పండగకు ఎలా?
ఏటా జనవరి రాకముందే పంట డబ్బులు చేతికందేవి. దీంతో రైతు కుటుంబాలకు పెద్దపండగ అయిన సంక్రాంతికి అన్ని ఖర్చులకూ ఏ ఇబ్బందీ ఉండేది కాదు. సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకునేవారు. కానీ గతేడాది, ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. జనవరి వచ్చినా ధాన్యం కొనుగోళ్ల ఊసే లేదు. కొనుగోలు చేసిన వాటికి డబ్బులిచ్చే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా దళారులు బస్తాకు రూ.300 నుంచి 500 వరకు తగ్గించి అడుగుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది రైతులు దళారులు అడిగిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.