Jan 12,2021 20:51

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం పలువురి ప్రాణాలను బలిగొంది. మోరెనా జిల్లాలో విషపూరితమైన మద్యం తాగి 11 మంది చనిపోగా, ఏడుగురు ఆస్పత్రిపాలయ్యారని ఎస్‌పి అనురాగ్‌ సుజానియా మంగళవారం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందతున్న ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగానే వుందన్నారు. మోరెనా జిల్లాలోని రెండు వేర్వేరు గ్రామాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పహవాలి గ్రామంలో ముగ్గురు మరణించగా, మన్‌పూర్‌ గ్రామంలో ఏడుగురు చనిపోయారు. మెరెనాలోని క్లినిక్‌లో ఏడుగురిని చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గ్వాలియర్‌ తీసుకెళ్ళారు. మద్యం తాగిన తర్వాత అర్ధరాత్రి సమయంలో వారు వాంతులు చేసుకోవడం ఆరంభంచారని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళగా మార్గమధ్యంలోనే 10 మంది మరణించగా, ఒకరు ఆస్పత్రిలో చనిపోయాడని పోలీసులు చెప్పారు. కల్తీ మద్యంపై బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం తయారీదారులతో ఎక్సైజ్‌ శాఖ, పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీంతో యథేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నాయని అన్నారు. ముకేష్‌ కిరార్‌ అనే లిక్కర్‌ సరఫరా ఏజెంటు తమకు ఈ లిక్కర్‌ను విక్రయించాడని, తెల్లని ద్రవం కలిసిన ఒక కంటెయినర్‌లోని లిక్కర్‌ తాగిన వారే ఇలా మరణించినట్లు బాధితుల్లో ఒకరు పోలీసులకు తెలిపారు.