Sep 15,2021 00:20

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
గ్రామాల్లో ఉపాధి పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు చేపట్టిన నిర్వాహకులకు బిల్లుల చెల్లింపుపై కొంతమంది సర్పంచ్‌లు బేరాలకు దిగుతున్నారు. బిల్లులు చెల్లించాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడి దు:ఖపెడుతున్నారు. కొంతమంది రెండు నుంచి ఐదు శాతం డిమాండ్‌ చేస్తే, మరికొందరు ఏకగా లక్షల రూపాయలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కమీషన్లు ఇవ్వడానికి అంగీకరించకపోతే బిల్లులు చెల్లించకుండా తిప్పుతున్నట్లు మెటీరియల్‌ సప్లయర్స్‌ వాపోతున్నారు. గతంలో పనులు చేసిన నిర్వాహకులు టిడిపికి చెందినవారైతే, వారిని వైసిపి సర్పంచ్‌లు మరింత ఇబ్బందిపెడుతున్నారు. టిడిపి ప్రభుత్వ కాలంలో గ్రామాల్లో ఉపాధి పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో సిమెంట్‌ రోడ్లు, కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో మెటీరియల్‌ సప్లయర్స్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 2018 నవంబరు నుంచి 2019 మార్చి 31వరకు చేపట్టిన పనులకు ప్రభుత్వ దశలవారీగా పంచాయతీలకు నిధులు జమ చేస్తోంది. పంచాయతీల్లోని ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ మెటీరియల్‌ సప్లయర్స్‌ ఖాతాకు ఈ నిధులు జమవుతున్నాయి. జమైన నిధులను సిమెంట్‌ రోడ్లు, కాలువ పనులు చేపట్టిన వారికి చెక్కుల ద్వారా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి బిల్లులు చెల్లించాల్సివుంది. పనులు చేపట్టిన వారికి మెటీరియల్‌ సప్లయర్స్‌ కింద బిల్లులు చెల్లించాలి. కానీ సప్లయర్స్‌కు బిల్లులు చెల్లించడానికి కొంత మంది సర్పంచ్‌లు బేరాలకు దిగుతున్నారు. కోర్టు ఆదేశాలతో బిల్లులు జమవుతున్నప్పటికీ సర్పంచ్‌ల నుంచి ఇబ్బందులు సప్లయర్స్‌కు తప్పడం లేదు. పంచాయతీ కార్యదర్శులు బిల్లులు చెల్లిస్తామంటున్నా, సర్పంచ్‌లు మాత్రం తిప్పుతుండడంతో కొంతమంది సప్లయర్స్‌ ఆయా మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అయినా కొంతమంది సర్పంచ్‌లు బిల్లులు చెల్లించకుండా మొండికేస్తున్నట్లు తెలిసింది. పనుల్లో నాణ్యతలేదంటూ 20 నుంచి 30 శాతానికిపైగా ప్రభుత్వం బిల్లులో కోత పెట్టింది. దీంతో చాలామంది సప్లయర్స్‌ లక్షల రూపాయలు నష్టపోయారు. మిగిలిన డబ్బులైనా వస్తే అప్పులు తీర్చుకుంటామని ఆతృతపడుతున్న సప్లయర్స్‌కు సర్పంచ్‌లు పెడుతున్న కమీషన్ల ఇబ్బందులతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.