Oct 17,2020 13:03

అమరావతి : ప్రపంచానికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయమని, కమ్యూనిస్టు పార్టీ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు ఉద్యమ శత వార్షికోత్సవాల కార్యక్రమాన్ని విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. భారతదేశంలో మార్క్సిస్టు, లెనిస్టు సిద్ధాంతాలకు అంకితం అయిన కమ్యూనిస్టుపార్టీ 100 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు రైతాంగం, మహిళలు, గిరిజనులు, దళితుల కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. జాతీయోద్యమంలో గర్వించదగిన పాత్ర నిర్వహించారని వివరించారు. ఎన్నో జమీందారి వ్యతిరేక, రైతాంగం ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహించారని, జాతీయోద్యమంలోనూ కమ్యూనిస్టులు ఉద్యమించారని, ఆ పోరాటాల పర్యవసానంగానే రైతులకు, మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన హక్కులు నేటి బిజెపి పాలనలో ప్రమాదంలో పడ్డాయని అన్నారు. పార్లమెంటులో కార్పొరేట్‌ వ్యవసాయానికి అనుకూలంగా మూడు చట్టాలను బిజెపి ప్రభుత్వం చేసిందని తెలిపారు. కార్మికుల హక్కులను ప్రమాదంలోకి నెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. బిజెపి పాలనలో మహిళలు, గిరిజనులు, దళితుల హక్కులకు భంగం వాటిల్లుతోందని మధు తెలిపారు. లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులకు, ఇబ్బందుల్లో ఉన్న కార్మిక కుటుంబాలకు కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు ఎనలేని సేవలందించాయని గుర్తుచేశారు. లాక్‌డౌన్‌ విధించడంతో ప్రమాదంలో పడ్డ ఉపాధి అవకాశాలను, నేటికీ పునరుద్ధరించే చర్యలు చేపట్టలేదని, నూటికి 50 శాతం మంది దేశంలో ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన చెందారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి సగం జీతాలే లభిస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బిజెపి కి రాష్ట్రంలోని అధికార పక్షం వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి వంత పాడుతున్నాయని విమర్శించారు. విభజన హామీలపై వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు నోరుమెదపడంలేదన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. కమ్యూనిస్టు ఆశయాలను సాధించేందుకు కమ్యూనిస్టులంతా పునరంకితం కావాలని మధు పిలుపునిచ్చారు. అనంతరం సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కృష్ణాజిల్లా పార్టీ కార్యదర్శి డివి కృష్ణ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్‌ బాబూరావు, డి.రమాదేవి, మంతెన సీతారాం, ఎం.కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.