Aug 08,2022 00:20

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి రాజమహేంవ్రరం తొలి ఎంఎల్‌ఎగా చరిత్ర సృష్టించిన చిట్టూరి ప్రభాకర చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా కూళ్ల గ్రామంలో 1922 సెప్టెంబరు 7న జన్మిం చారు. తల్లిదండ్రులు అచ్యుత రామయ్య, సుబ్బలక్ష్మి. 1940లో దేశవ్యాప్త సమ్మె సమయంలో ఆయన ఉద్యమాలబాట పట్టారు. అప్పట్లో ఆలిండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జాతీయ మహా సభలు రాజ మహేంద్రవరంలో జరిగాయి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పాల్గొన్న ఈ సభలకు ప్రభాకర చౌదరి వాలంటీర్‌గా ఉన్నారు. స్వాతంత్య్ర ఉద్య మంలో పాల్గొన్నారు. 1952లో రాజమహేంద్ర వరం అసెంబ్లీ నుంచి తొలిసారి ఉమ్మడి కమ్యూ నిస్టు పార్టీ ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. 1960లో రాజమహేంద్రవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1965లో గోదావరి రోడ్డు కం రైలు బ్రిడ్జి కోసం ఉద్యమం సాగించారు. గోదావరి రైల్వే స్టేషన్‌లో రైళ్లను నిలిపి సత్యాగ్రహం చేశారు. గోదావరి నదిలో వస్తురవాణా ఎంత వ్యయ ప్రయాసో పూర్తిగా గమనించి 1967 నుంచి 1972 వరకు ప్రతి అసెంబ్లీ మీటింగ్‌లో గోదా వరిపై బ్రిడ్జి కోసం కృషి చేశారు. అందరి ఎంఎల్‌ఎలను కలిసి సిఎం దష్టికి తీసుకుని వెళ్లారు. ఢిల్లీ వెళ్ళి పార్టీ ఎంపీలను కలిసి మంత్రులతో మాట్లాడారు. వంతెన సాధింంచారు. వీరేశలింగ పురం (విఎల్‌.పురం) మోరంపూడి సొసైటీ ద్వారా లే ఔట్‌ వేసి డెవలప్‌ చేశారు. దాని పేరు ప్రభాకర చౌదరి నగర్‌ అని పెడతామని చెబితే తన పేరు వద్దని సంఘ సంస్కర్త వీరేశలింగం పేరునే విఎల్‌. పురంగా పెట్టించారు. రాజమహేంద్ర వరంలో ఎన్నో మంచి కార్య క్రమాలను ముందుండి నడిపించారు. 1968లో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్య మంలో పాలు పంచుకున్నారు. 1967లో మళ్లీ ఎంఎల్‌ఎగా ఎన్నికై విద్యాభివద్ధికి కషి చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణానికి కృషి చేశారు. పేపర్‌మిల్లు యూనియన్‌ గౌరవాధ్యక్షునిగా కార్మికుల సంక్షేమానికి పాటు పడ్డారు. గోడలపై రెండో ప్రపంచ యుద్ధ వ్యతిరేక నినాదాలు రాశారు. స్వతంత్ర భారత పత్రికను పంచారు. 1948లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత తుమ్మలావ సమీపంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 1952లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో నాలుగు నెలల పెరోల్‌పై చిట్టూరి బయటకు వచ్చి, ఆ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి 29 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రభాకర చౌదరికి 1943లో రాజమహేంద్రవరం కోర్లమ్మ పేటలో దళిత నాయకుడు కుసుమ ధర్మన్నతో పరిచయం ఏర్పడింది. ఆయన తోడల్లుని కుమార్తె సుశీలతో పరిచయం పెరిగింది. ఆమె టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత 1946 జూన్‌లో వీరి ద్దరూ రాజ మండ్రి కృష్ణా థియేటర్‌లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. దాదాపు ఏడు దశా బ్దాల పాటు చిట్టూరి తన అవిశ్రాంత జీవితమంతా ప్రజలు, కార్మి కుల పక్షాన పోరాటాలు సాగించారు. 2021 మే 1న అనా రోగ్యంతో 98 ఏళ్ల వయ సులో చిట్టూరి ప్రభాకర చౌదరి మతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భార్య సుశీల గతంలోనే మతి చెందారు.
1942 క్విట్‌ ఇండియా పిలుపు ఇచ్చినప్పుడు చిట్టూరి ప్రభాకర చౌదరి సమ్మెకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ కాలంలో కాంగ్రెస్‌ నాయకులతో పాటు ఆయనను అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. అనంతరం కొంతకాలానికి విడుదల చేశారు. 1946లో రైతాంగ కార్మిక ఉద్యమాలు పతాక స్థాయిలో జరిగాయి.
ఆ కాలంలో కమ్యూనిస్టులను అరెస్టు చేయా లని, లేదా కాల్చి చంపాలని ఆర్డినెన్స్‌ వచ్చింది. దీంతో చింతం సత్యనారాయణ దాసు, పెన్మత్స అనంతంలను సామర్లకోట వద్ద పోలీసులు కాల్చి చంపారు. రాజమహేంద్రవరం వీరభద్ర పురంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నర్రా ఆంజనేయుల, చిట్టూరి ప్రభాకర చౌదరి ఒక ఇంటిలో ఉండగా ఆంజనేయులును పోలీసులు కాల్చి చంపారు. చిట్టూరి ప్రభాకర చౌదరిని చంప బోతుంటే అప్పటి కాంగ్రెస్‌ ప్రముఖ నాయకులు క్రొవ్విడి లింగరాజు అడ్డుకున్నారు.