Jul 29,2021 23:24

సినిమాహాల్‌ సెంటర్‌లో రిజిస్ట్రేషన్‌ చేసిన స్థలం

ప్రజాశక్తి - కారంపూడి : భూ సమస్యల పరిష్కారం కోసం వేళితే సర్వే ద్వారా హద్దులు నిర్ణయించాల్సిన అధికారే హద్దులు మీరుతున్నారు. అక్రమంగా నగదు పుచ్చుకోవడం ఒకెత్తయితే ఏకంగా స్థలాలనూ తన పేర నమోదు చేయించేసుకుంటున్నారు.. మండల కేంద్రమైన కారంపూడిలోని సినిమా హాల్‌ సెంటర్‌ ఎదుట అత్యధిక విలువ చేసే 1.28 ఎకరాల స్థలం వివాదంలో చిక్కుకుంది. దాని సర్వే కోసం స్థల యజమానులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సర్వేయర్‌ను సంప్రదించారు. దీంతో వారికి నానా మాటలు చెప్పిన సదరు అధికారి ఇందులో 10 సెంట్లను తన బంధువుల పేరుమీద, మరో 4 సెంట్లను తన పేరుమీద ఆన్‌లైన్‌ చేయించుకుని మిగతా స్థలాన్ని అర్జిదారుల పేరుమీద ఉండేలా రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయితే ఇదే స్థలం గతంలో ప్రభుత్వ స్థలమని ప్రచారం చేయగా తహశీల్దార్‌, సర్వేయర్‌ బృందం సర్వే చేసి ప్రభుత్వ స్థలం కాదని నిర్ధారించి యజమానిదేనని తేల్చడం గమనార్హం. కొన్ని రోజుల తర్వాత సర్వేయర్‌ అదే స్థలంలో కొంతభాగాన్ని తన పేరు మీద రిజిస్టర్‌ చేయించుకోవడం, దీనిపై స్థల యజమాని తహశీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వినుకొండ రోడ్డులోని ప్రభుత్వ భూములపై కన్నేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అధికారిని సంప్రదించగా దానికీ పట్టాలు పుట్టించి వారికి కట్టబెట్టేశారు. తన వాటాగా 20 సెంట్లను తనపేర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇంత చేస్తూ తనకేమీ కాదని, అన్ని రకాల అండదండలూ పుష్కలంగా ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రీసర్వే పథకాన్నీ ఆసరాగా చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. భూ వివాదాలను ఆసరాగా చేసుకుని స్థల యజమానుల వద్ద స్థలాన్ని కాజేస్తున్న అధికారి ఆగడాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.