Feb 06,2023 23:30

నిర్మాణం అసంపూర్తిగా వదిలేసిన రహదారిని పరిశీలిస్తున్న ఎంపిపి లక్ష్మి తదితరులు

ఎంపిపి కారం లక్ష్మి
ప్రజాశక్తి-విఆర్‌.పురం

మండలంలోని మారుమూల కుందులూరు రహదారి నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని ఎంపిపి కారం లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ పంచాయతీ పరిధి తెల్లవారు గూడెం నుండి గుల్లెట్‌వాడ వరకు తవ్వి వదిలేసిన రహదారిని సోమవారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణతో కలిసి ఎంపిపి లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెల్లవారి గూడెం నుండి గుల్లెట్‌ వాడ రహదారికి శంకుస్థాపన చేసి రెండేళ్లు కావస్తున్నా నేటికీ దాని నిర్మాణం పూర్తి చేయలేదని తెలిపారు. ఈ రహదారిని తవ్వి వదిలేయడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పనులు, వైద్య సేవల కోసం మండల కేంద్రానికి వెళ్ళాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. తక్షణమే ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి గుత్తేదారు యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్న బాబు, నాయకులు పంకు సత్తిబాబు, లక్ష్మణరావు గ్రామస్తులు పాల్గొన్నారు.