Nov 25,2021 13:12

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలు రద్దు కోరుతూ రైతులు చేపడుతోన్న ఆందోళనల్లో పాల్గొన్న సిక్కులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు.. ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్‌ సమన్లు జారీ చేసింది. ప్యానెల్‌ ముందు డిసెంబర్‌ ఆరో తేదీన హాజరుకావాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ఆదేశించారు. సోషల్‌ మీడియాలో సిక్కులపై అనుచిత రీతిలో వ్యాఖ్యలు చేసిన కంగనాపై ముంబైలోనూ కేసు నమోదు చేశారు. ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ధర్నాలు ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ కంగనా ఆరోపణలు చేశారు. అయితే ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. సిక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన షూ కింద దోమల్ని నలిపివేసినట్లు నలిపివేశారని, అలాంటి వారే దేశానికి కావాలంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతులను ఖలీస్తానీయులుగా అభివర్ణించారు.