
ప్రజాశక్తి- విజయనగరం కోట : ఆర్‌టిసి అవుట్ సోర్సింగ్, అద్దెబస్ డ్రైవర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ జిల్లా కన్వీనర్ ఎ.జగన్మోహన్ మాట్లాడుతూ ఆర్‌టిసిలో ప్రభుత్వ బస్ సర్వీసుల తో పాటు, డ్రైవర్ల సంఖ్య కూడా తగ్గుతుందని అన్నారు ఈనేపథ్యంలో ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్నారని, వీరి వేతనాల్లో మాత్రం అత్యంత వ్యత్యాసం ఉందని అన్నారు. కిలోమీటర్ల ప్రాతిపదికన జీతం నిర్ణయించడంతో ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా కారణంతో బస్సు ఆగినా, లోడింగ్ అన్లోడింగ్ సమయంలో ఇబ్బంది జరిగినా, ప్రమాదాలు జరిగే సందర్భాల్లోను ఒక రోజు వేతనం నిలుపుదల చేస్తున్నారని, రిపేర్లకు అవసరమైన డబ్బులు డ్రైవర్ల నుంచి కలెక్ట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్గో సర్వీసులకు పరిమితికి మించి లోడింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో యూనియన్ గౌరవ అధ్యక్షులు జెఎస్‌ఎన్ రాజు, నాయకులు సురేష్, ధనుంజరు, జగదీష్, నాయుడు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
28న రవాణా రంగ కార్మికుల సదస్సు
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మోటారు వాహన చట్టం 2020, జీవో నెంబర్ 21ను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 28న కోట జంక్షన్ వద్ద జరిగే మోటారు వాహన డ్రైవర్ల సదస్సును జయప్రదం చేయాలని ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ జిల్లా కన్వీనర్ ఎ.జగన్మోహన్‌రావు పిలుపునిచ్చారు. సంబంధిత గోడపత్రికను కోట ఆటో స్టాండ్ వద్ద ఆవిష్కరించారు.
కార్యక్రమంలో శ్రీను, బంగారు రాజు, రామనాయుడు తదితరులు పాల్గొన్నారు.