Jan 14,2022 07:17

ఇంత విపత్తు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్రజాప్రతినిధులు కనీసం పలకరించ లేదు. రైతులు ఆందోళన చేసిన చోట నిపుణులు, శాస్త్రవేత్తలు పరిశీలించి నివేదికలు తయారు చేశారు. కానీ ప్రభుత్వాలు నష్టపరిహారం ఇప్పటివరకు ప్రకటించలేదు. స్టాక్‌ మార్కెట్లు, సెన్సెక్స్‌ పడిపోతే ప్రభుత్వాలు కంపించిపోతాయి. లక్షలాది మంది రైతుల జీవితాలు దెబ్బతిన్నా పాలకులలో ఉలుకు, పలుకు లేదు.

    సాధారణంగా మిర్చి ఘాటుకి కన్నీళ్లు వస్తాయి. కానీ ఇప్పుడు మిర్చి పంట పూర్తిగా దెబ్బ తిని మిర్చి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రపంచమంతా కరోనా, ఒమిక్రాన్‌ వైరస్‌తో అతలాకుతలం అవుతోంది. రైతులు మాత్రం మిర్చి పంటకు వచ్చిన తామర పురుగు, నల్లి, ఇతర కొత్త వైరస్‌లతో పంట సర్వనాశనం కావడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా పశ్చిమ ప్రాంతంలో గంపలగూడెం, ఏ.కొండూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో సిపిఎం బృందం పర్యటించి...మిర్చి పంటలను పరిశీలించి రైతుల బాధలను తెలుసుకున్నది.
    మన రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. దేశంలోని మిర్చి పంటలో తెలుగు రాష్ట్రాలలోనే 67 శాతం పంట వేస్తున్నారు (ఎ.పి 43.5 శాతం, తెలంగాణ 23.5 శాతం). 40 దేశాలకు ప్రతి సంవత్సరం 6 నుండి 7 లక్షల క్వింటాళ్లు ఎగుమతి చేయడం ద్వారా ఏడు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వస్తోంది.
 

                                                      సంక్షోభంలో మిర్చి రైతులు

    వరి గిట్టుబాటు కాక రైతులు మిర్చి, పత్తి తదితర వాణిజ్య పంటల వైపు మళ్ళారు. ఇప్పుడు వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉంది. ఈ సంవత్సరం పంటకు పట్టిన అనేక రకాల వైరస్‌లతో పంట మొత్తం సర్వనాశనం అయ్యింది. గత సంవత్సరం పత్తి వేసి దెబ్బతిన్న రైతులు, (అప్పుడు మిర్చి రేటు బాగా ఉండటంతో) అత్యధిక మంది ఈ సంవత్సరం మిర్చి వేశారు. దీంతో మిర్చి నారు, మొక్కల రేటు పెరిగింది. ఒకొక్క మొక్క రూ. 1.25 నుండి రూ. 2.50 పెట్టి కొనుగోలు చేశారు. ఒక ఎకరానికి 20 వేల నుండి 40 వేల రూపాయల వరకు మొక్కలకే ఖర్చయిందని రైతులు వాపోయారు. పంటకు పురుగు పట్టడంతో మొత్తం తొలగించి మళ్లీ రెండోసారి మొక్కలు కొని తిరిగి పంట వేయటంతో రెట్టింపు ఖర్చయ్యింది. ప్రతి సంవత్సరం సాధారణంగా పురుగు వస్తే మందు కొడితే పంట నిలబడేది. కానీ ఈ సంవత్సరం వచ్చిన వైరస్‌ లతో ప్రతి సంవత్సరం వాడే దానికన్నా 90 శాతం పురుగు మందులు అదనంగా వాడారు. ఈ మందులకే 40, 50 వేల రూపాయల వరకు ఖర్చు అయ్యింది. పురుగు మందుల షాపులలో రెండు రూపాయలు వడ్డీలకు తెచ్చి ఏది చెబితే ఆ మందులు వాడారు.
     ఏ పొలంలో చూసినా పురుగు మందుల ఖాళీ డబ్బాలు, పెట్టెలతో నిండిపోయి కనిపించాయి. రంగు రంగుల అట్టలు (ఒక్కొక్క అట్ట రూ.35) కడితే పురుగులు దానికంటుకుని, పంట బతికి బట్ట కడుతుందని, ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు. రైతులు రోజు విడిచి రోజు పురుగు మందులు చల్లారు. దీంతో వారి ఆరోగ్యం కూడా దెబ్బ తిన్నది. అనుముల్లంక గ్రామం లోని ఒక రైతు ఆరోగ్యం దెబ్బతిని విజయవాడ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం కోసం 60 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీర్ఘ కాలంలో రైతుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు...తొంగి చూసిన పాపాన పోలేదు. కనీసం సలహాలు కూడా ఇవ్వలేదు. పురుగు మందుల షాపుల వారు రకరకాల బ్రాండ్లు చెబితే రైతులకు గత్యంతరం లేక వాటిపై ఆధారపడి వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. కొందరు రైతులు యూట్యూబ్‌లో చూసి రకరకాల ప్రయోగాలు చేశారు. యూట్యూబ్‌లో కూడా పెస్టిసైడ్‌ కంపెనీలవారే రైతులకు సలహాలు ఇచ్చారు. కానీ ప్రభుత్వ శాఖలు కనీసం సూచనలు కూడా చేయలేదు. దాదాపు ప్రతి ఎకరానికి లక్ష పైనే రైతులు ఖర్చు చేశారు. మరోవైపు నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉంది. అకాల వర్షాలు పంటలను దెబ్బతీశాయి. పగలు కోతుల బెడద, రాత్రి వేళల్లో అడవి పందుల బెడదతో రాత్రింబగళ్ళు రైతులు పొలాల్లోనే ఉంటూ 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకున్నా పంట సర్వం కోల్పోయారు.
    వారి ఆశలు అడియాశలు అయ్యాయి. కొందరు రైతులు దెబ్బతిన్న పంట దున్నేశారు. అత్యధిక మంది భవిష్యత్తులో ప్రభుత్వ అధికారులు వస్తే చూపించడం కోసం అలా వదిలేశారు. పంట పచ్చగా కనపడినా దిగుబడి లేదు. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల పండినా మిర్చి నాణ్యత లేకుండా పోయింది. ప్రతి సంవత్సరం ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్లుమిర్చి దిగుబడి వస్తుండగా ఈ సంవత్సరం రెండు నుండి ఐదు క్వింటాళ్లు కూడా రాకపోవడం బాధాకరం. వచ్చిన కొద్దిపాటి పంటకు నాణ్యత లేక రేటు సగానికి కూడా కొనుగోలు చేసే దిక్కులేదు. గతంలో మిర్చి కోసిన తర్వాత తాలు, తప్ప ఏరే వారు. ఇప్పుడు బాగున్న కాయలు ఏరుతున్నారంటే పంట ఎంతగా దెబ్బతిన్నదో అర్థమవుతుంది. కొంతమంది రైతులు కూలి గిట్టుబాటు కాదని కాయ కోయడం కూడా ఆపేశారు. ఇప్పుడు పత్తి, మామిడి, మినుముకి కూడా తెగుళ్లు వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గులాబీ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలింది.
 

                                                             కౌలు రైతుల వెతలు

ప్రతి గ్రామంలో మిర్చి పంట వేసిన వారిలో కౌలు రైతులు సగం మంది పైన ఉన్నారు. కొన్ని గ్రామాలలో 90 శాతం వరకు కౌలు రైతులే. ఎకరానికి 20 నుండి 40 వేల రూపాయల వరకు కౌలు ఉంది. కొందరు అడ్వాన్స్‌ కూడా చెల్లించారు. పంట దెబ్బ తిన్నా కౌలు చెల్లించకపోతే రాబోయే సంవత్సరాల్లో కౌలుకు ఇవ్వరనే భయంతో కౌలు చెల్లించక తప్పదని కౌలు రైతులు వాపోయారు. వీరికి ప్రభుత్వం నుండి, బ్యాంకుల నుండి ఎటువంటి రుణ సహాయం అందలేదు. ఈ-క్రాప్‌ నమోదు లోనూ అన్నీ చిక్కులే. ప్రైవేటు అప్పులు తీసుకుని, ఆదాయం వస్తుందనే ఆశపడి పెట్టుబడి పెట్టారు. దీనికితోడు సాగునీటి సదుపాయం లేక ఒక్కొక్క తడికి రెండు వేల రూపాయల చొప్పున ఇంజన్లకు ఖర్చు పెట్టారు. ప్లాస్టిక్‌ పైపులు అద్దెకు తెచ్చుకున్నారు. సొంత బోర్లు ఉన్న రైతులకు డబ్బు చెల్లించి నీరు కొనుక్కున్నారు. సాగు నీటికి రైతులకు ఎకరానికి రూ.10 నుండి 15 వేల ఖర్చు అయింది. కరోనా తో ఆటో, భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయింది. వారు జీవనం సాగించడానికి కొత్తగా కౌలు రైతులుగా మారారు. ఇందులో మహిళలు, యువత కూడా ఉన్నారు. జింకల పాలెం గ్రామంలో గతంలో ముస్లిం కుటుంబాల పెద్దలు రోళ్లు, రాళ్లు కొట్టుకునే పనిలో ఉండేవారు. వారి పిల్లలు ఇప్పుడు కౌలు రైతులుగా మారారు. మిర్చి వేసి నిండా మునిగి పోయారు. కౌలు రైతులకు ఎకరానికి అదనంగా రూ.30 నుంచి 50 వేల వరకు సాగుకు ఖర్చయింది.
 

                                                              అందరూ బాధితులే

కూలీలు కూడా బాధితులే. మిర్చి సీజన్లో పని చేయడానికి స్థానిక కూలీలు చాలక, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుండి కూలీలు వలస వచ్చేవారు. ఎకరం మిర్చి సాగుకు...కూలీలకు సంవత్సరానికి 600 పని దినాలు పని ఉండేది. ప్రస్తుతం పంట దెబ్బ తినడంతో ఎకరానికి 150-250 రోజులకు మించి పని దినాలు లేకుండా పోయాయి. ప్రతి సంవత్సరం మార్చి వరకు ఉండే పనులు, ఈ సంవత్సరం జనవరి 10వ తేదీ నాటికే పనులన్నీ ఆగిపోయాయి. స్థానికులకే పని లేకుండా పోయింది. కూలీలను కదిలిస్తే 'అన్ని ధరలు పెరిగాయి. పైపెచ్చు ఇళ్ల రిజిస్ట్రేషన్లకు వేల రూపాయలు కట్టమంటున్నారు. పనులు లేకుండా పోయాయి. ప్రతి సంవత్సరం 300 రూపాయలు కూలీ ఇచ్చేవారు. రైతుకి ఆదాయం లేక 200-250 రూపాయలకు కూలి పడిపోయింది' అని కూలీలు ఆవేదనతో చెప్పారు. ఆదాయాలు చాలక సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న ఏడవ తరగతి ఆడ పిల్లలు కూడా కూలికి రావడం కళ్ళారా చూశాం. మే నెలలో పెట్టే ఉపాధి హామీ పనులు ఈ సంవత్సరం జనవరి నెల నుండే ప్రారంభించాలన్న డిమాండ్‌ వారి నుండే వచ్చింది. రైతులు, కౌలు రైతులు, కూలీలే కాదు. మిర్చి పంట అధికంగా ఉండే గ్రామాలలో ఆర్థిక వ్యవస్థ పైన, అందరిపైనా దీని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది. సంక్రాంతి కళ తప్పింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
     ఇంత విపత్తు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్రజాప్రతినిధులు కనీసం పలకరించ లేదు. రైతులు ఆందోళన చేసిన చోట నిపుణులు, శాస్త్రవేత్తలు పరిశీలించి నివేదికలు తయారు చేశారు. కానీ ప్రభుత్వాలు నష్టపరిహారం ఇప్పటివరకు ప్రకటించలేదు. స్టాక్‌ మార్కెట్లు, సెన్సెక్స్‌ పడిపోతే ప్రభుత్వాలు కంపించిపోతాయి. లక్షలాది మంది రైతుల జీవితాలు దెబ్బతిన్నా పాలకులలో ఉలుకు, పలుకు లేదు.
    పంట దెబ్బతినడంతో ఏడు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం రాకుండా పోయిందనే బెంగ తప్ప...రైతుల జీవితాలు సర్వనాశనం అయ్యాయనే బాధ పాలకుల్లో మచ్చుకు కూడా కనపడటం లేదు. కరోనా వస్తే 10, 15 రోజులకు తగ్గుతుంది. కానీ పంటకు వచ్చిన వైరస్‌తో చేసిన అప్పులు మా జీవితాంతం తీరవని రైతులు చెప్పిన మాటలు వారి దీనావస్థను తెలియజేస్తున్నది.
    రైతులకు రెట్టింపు ఆదాయం, పంటల బీమా, రైతు రాజ్యం, రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు...ఇలా ప్రభుత్వాలు చెప్పే పథకాలు, నినాదాలు కాగితాల పైనే మిగిలిపోయాయి. ఆచరణలో ఇవేవీ రైతులను ఆదుకోలేదు. పాలకుల, వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతున్నది.
    పంట దిగుబడి తగ్గటంతో మిర్చి, కారం రేట్లు పెరిగి ప్రజలపై భారం పడుతుంది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకోవడం మాని రైతులను ఆదుకోవాలి. కనీసం ఎకరానికి లక్ష రూపాయలు, కౌలు రైతులకు లక్షా 30 వేల నుండి లక్షా 50 వేల రూపాయలు పరిహారం అందించాలనీ రైతాంగం కోరుతోంది. కూలీలకు పనులు కల్పించాలి. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.
   రైతులందరూ ఏకం కావాలి. మిర్చి రైతు ఉద్యమాల ఘాటు ప్రభుత్వానికి తగిలేలా చేయాలి. ఐక్య ఉద్యమాలు చేపట్టాలి. రైతులకు సిపిఎం సంపూర్ణంగా అండగా నిలబడుతుంది. రైతుల ఆందోళనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలి.
 

(వ్యాసకర్త - సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
సిహెచ్‌. బాబూరావు

సిహెచ్‌. బాబూరావు