Apr 18,2021 07:06

* కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో తగ్గిన డిమాండ్‌
* ఎకరాకు రూ.6 వేలు నుంచి రూ.8 వేలు నష్టం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి కాయల ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా నేలను తాకుతున్నాయి. వెయ్యి పచ్చి కాయలు ఈ వేసవి సీజన్‌లో ఏటా రూ.13 వేలు పలికేవి. అంబాజీపేట మార్కెట్లో ప్రస్తుతం రూ.8 వేలకు మంచి ధర లభించడం లేదు. నాణ్యత కొంత తక్కువగా ఉండే రాజోలు, అమలాపురం తదితర మార్కెట్లలో రూ.6 వేల నుంచి రూ.7 వేలకు ధర మించడం లేదు. దీంతో, ఎకరాకు రైతులు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకూ నష్టపోతున్నారు. ఎకరాకు 1,200 కాయలు దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుతం ఎకరాకు 800 కాయలకు దిగుబడి మించడం లేదు. తెల్లదోమ కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఎకరాకు 400 కాయలు దిగుబడి తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఎకరాకు మరో రూ.4 వేలు నష్టం చవి చూడాల్సి వస్తోంది. కురిడీ కొబ్బరి కాయల ధరలూ మందగించాయి. రూ.14,000 పలికాల్సిన పలకాల్సిన గటగట రకం పాత కాయలకు ప్రస్తుతం రూ.11,000 మాత్రమే ధర లభిస్తోంది. ఫలితంగా రైతులు రూ.3 వేలు వరకూ నష్టపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నెలలో ధరలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో ధరలు క్రమంగా పతనమవుతూ వచ్చాయి. ఉగాది, శ్రీరామ నవమి పండగలు, మరో వైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావించారు. అయితే, కరోనా సెకండ్‌ వేవ్‌ వారి ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లింది. ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, గుజరాత్‌, బీహార్‌, మహారాష్ట్ర, హరియాణాలకు ఏటా ఇక్కడి నుంచి సీజన్లో కొబ్బరి కాయల ఎగుమతులు జోరందుకుంటాయి. దీంతో, ధరలు ఆశాజనకంగా ఉండొచ్చని రైతులు ఆశించారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొన్ని రాష్ట్రాల్లో మార్కెట్ల సమయాన్ని కుదించారు. దీంతో, ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. గతంలో ప్రతి రోజూ తూర్పుగోదావరి జిల్లా నుంచి వంద నుంచి రెండు వందల లారీల వరకు కొబ్బరి ఎగుమతులు చేసేవారు. ప్రస్తుతం దిగుబడి తగ్గడం, ధర పతనం అవ్వడం, ఈశాన్య రాష్ట్రాల్లో డిమాండ్‌ లేకపోవడంతో రోజుకు 40 నుంచి 50 లారీలకు మించి ఎగుమతి కావడం లేదు. ఇక్కడ సాగు చేసిన కొబ్బరి కాయలకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పోటీ నెలకొంది. అక్కడ సాగు చేసిన కాయలు పరిమాణంలో పెద్దగా ఉంటున్నాయి. అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు రవాణా ఖర్చులు కూడా తక్కువగా ఉంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా ఆ ప్రాంతాలకే తొలి ప్రాధాన్యత లభిస్తోంది. అక్కడి మార్కెట్లో కాయల కొరత ఏర్పడితేనే ఇక్కడ డిమాండ్‌ పెరుగుతుంది. జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది. 40 వేల మంది కొబ్బరి రైతులు ఉన్నారు. సుమారు 1.2 లక్షల మంది కూలీలు కొబ్బరి మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంబాజీపేట ప్రధాన కేంద్రంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, తెలంగాణ, నాగ్‌పూర్‌ తదితర రాష్ట్రాలకు కొబ్బరికాయలు ఎగుమతి చేస్తున్నారు. కొబ్బరి ధర పెరగకపోతే తీవ్రంగా నష్టపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.