May 17,2022 23:31

ఫొటో : ప్రజలకు ధరల పెరుగుదలపై వివరిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ పోలంరెడ్డి

ఫొటో : ప్రజలకు ధరల పెరుగుదలపై వివరిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ పోలంరెడ్డి
కొడవలూరులో 'బాదుడే బాదుడు'
ప్రజాశక్తి-కొడవలూరు : టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మాజీ ఎంఎల్‌ఎ పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మంగళవారం హరిజనవాడలో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో చేపట్టారు. హరిజనవాడలోని ప్రతి ఇంటికి తిరిగి వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. వైసిపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను వివరించక ముందే ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను ఆయన దృష్టికి తీసుకు రావడం గమణార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వస్తువుపై అన్ని విధాల విపరీతంగా ధరలు పెంచి వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ఉప్పు దగ్గర నుండి పప్పు వరకు ఈ ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై బాదుడు కార్యక్రమం చేస్తున్నారన్నారు.
పెట్రోలు, డీజిల్‌ ధరలు ఆర్‌టిసి ఛార్జీలు విపరీతంగా పెంచేసి పేద, సామాన్య, మధ్య తరగతితోపాటు అన్ని వర్గాల ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సిలిండర్‌ గ్యాస్‌ ధర నాలుగు వందల రూపాయలకు అందజేస్తే ప్రస్తుత ప్రభుత్వం సిలిండర్‌ ధర రూ.1050 చేయడం దారుణమన్నారు. చెత్త మీద పన్ను , మరుగుదొడ్లు మీద పన్ను, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచడం టోల్‌ట్యాక్స్‌ పెంచి ఈ ప్రభుత్వం ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద న్నారు. ప్రజలకు మేలు చేయడంలో, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్ని విధాల విఫలమయ్యారని విమర్శించారు. నిర్మాణ రంగం ఈ ప్రభుత్వంలో పూర్తిగా చతికిలబడిందని కొత్త ప్రాజెక్టులు రాకపోగా నిర్మాణంలో ఉండే ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన ధ్వజమెత్తారు. టిడిపి ప్రభుత్వం హయాంలో ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇస్తే వైసిపి ప్రభుత్వం లారీ ఇసుక రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు పలుకుతోందని ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగం ఎలాంటి దుస్థితిలో ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాల న్నారు. ఉన్న పరిశ్రమలు తరలివెళ్లడం, కొత్త పరిశ్రమలు రాక పోవడంతో రాష్ట్రంలోని యువత ఉద్యోగాలు, ఉపాధి కరువై దయనీయ స్థితిలో ఉన్నారని తెలిపారు. పేద మధ్యతరగతి, సామాన్య ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి, కరకట మల్లికార్జున, చెక్కా మదన్మోహన్‌, ఎంపిటిసి గరికపాటి రాజేంద్ర, పెద్ద ఎత్తున స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.