Mar 28,2023 00:29

స్పందన లో ఫిర్యాదు చేస్తున్న కేబుల్‌ ఆపరేటర్లు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : సిటీకేబుల్‌కు ఇతర నెట్‌ వర్క్‌ల నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా గుంటూరు నగరంలో కేబుల్‌ ప్రసారాలు మూడ్రోజులుగా నిలిచాయి. కేబుల్‌ వ్యాపారంలో దూసుకుపోవాలని తలంపుతో విద్యుత్‌ శాఖ అధికారుల ద్వారా స్తంభాలకు ఉన్న కేబుల్‌ వైర్లను వైసిపి ప్రజాప్రతినిధులు తొలగింపజేశారు. వీటి పునరుద్ధరణకు ప్రయత్నించిన మెకానిక్‌లపై రెండ్రోజులుగా కేసులు పెట్టించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో వారుకూడా వెనుకంజ వేశారు.
సిటీ కేబుల్‌ యాజమాన్యం గత ప్రభుత్వ హయాంలో గుంటూరుతో సహా వివిధ పట్టణాల్లో అప్పట్లో ఉన్న కేబుల్‌ ఆపరేటర్లను తొలగించి వారిపై పోలీసు కేసులు పెట్టించి తన గుత్తాధిపత్యాన్ని పెంచుకుందని వైసిపి నేతలు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా సిటీ కేబుల్‌ కనెక్షన్ల స్థానంలో తమ కనెక్షన్లు తీసుకునేలా వినియోగదారులకు పలు ఆఫర్లుకూడా ఇస్తున్నారు. సెట్‌ అప్‌ బాక్సులను ఉచితంగా ఇస్తామని, మా కనెక్షన్లు తీసుకోవాలని వైసిపి నాయకుల అనుచరులు ఇళ్ల వెంబడి తిరుగుతున్నారు. స్టే ఉత్తర్వులున్నా విద్యుత్‌ అధికారులు తమవైర్లను తొలగించారని సిటీకేబుల్‌ కనెక్షన్లు ఇస్తున్న పలువురు ఆపరేటర్లు సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విద్యుత్‌ అధికారుల చర్యలపై ఆపరేటర్లు, సిటీ కేబుల్‌ యాజమాన్యాలు హైకోర్ట్లులో సోమవారం కోర్టు దిక్కరణ పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై బుధవారం విచారణ జరగనున్నట్టు న్యాయవాదులు చెప్పారని ఆపరేటర్లు తెలిపారు.
గత శనివారం నుంచి నిలిచిపోయిన కేబుల్‌ ప్రసారాలను తమసొంత నెట్‌ వర్కుల ద్వారా పునరుద్ధరించేందుకు వివిధ కంపెనీల నెట్‌ వర్కుల నిర్వాహకులు రంగ ప్రవేశం చేశారు. దీనిని అడ్డుకునేందుకు ఆపరేటర్లు ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరుతున్నారు. ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశంపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేబుల్‌ రంగం విస్తరణలో దూసుకుపోతున్న నగర డిప్యూటీ మేయర్‌ డైమండ్‌ బాబు తన నెట్‌ వర్కును విస్తరింపజేసుకోవడానికి విద్యుత్‌ అధికారుల ద్వారా తమ కేబుల్‌ వైర్లను తొలగింప చేశారని సిటీకేబుల్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. గుంటూరుకు 15 కిలో మీటర్ల పరిధిలో సిటీ కేబుల్‌ కనెక్షన్‌ దారులకు కేబుల్‌ ప్రసారాలు నిలిచి ప్రజలు అసౌర్యానికి గురవుతున్నారు.