Jul 21,2021 21:07

బగోటా : కొలంబియాలో పేదరికాన్ని, ఆర్థిక అసమానతలను నిరసిస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. కోవిడ్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో గత నెల రోజులుగా ఎలాంటి కార్యకలాపాలు చోటు చేసుకోనప్పటికీ స్వాతంత్య్ర దినోత్సవమైన జులై 20న పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. కాగా, తీవ్రవాద చర్యల ఫలితమే ఈ ప్రదర్శనలని కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ డుక్యూ విమర్శించారు. అక్రమంగా పనిచేస్తున్న సాయుధ గ్రూపుల మద్దతు వీరికి వుందని ఆరోపించారు. తమ దేశంలో జరిగే ఆందోళనల పట్ల ఈ రీతిలో వ్యాఖ్యానించిన కొలంబియా ప్రభుత్వం క్యూబాలో నిరసన తెలియచేసిన ప్రదర్శకులకు సంఘీభావం తెలిపింది. ఆర్థిక అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా స్వదేశంలో జరిగిన ప్రజా ప్రదర్శనలను కఠినంగా అణచివేసిన కొలంబియా, క్యూబాలో నిరసనలను మాత్రం సమర్ధించింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇవ్వాలని క్యూబన్‌ ప్రభుత్వాన్ని కొలంబియా విదేశాంగ శాఖ కోరింది. శాంతియుత నిరసనలు జరిపే హక్కును గౌరవించాలని కోరింది. పన్నుల సంస్కరణల పట్ల ఏప్రిల్‌ చివరి నుండి కొలంబియాలో నిరసనలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ఆర్థిక అసమానతల పట్ల, మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల కొలంబియా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. దేశవ్యాప్తంగా పోలీసుల దాడులు, ఆందోళనకారులు రోడ్డు దిగ్బంధనాలు జరుగుతునే వున్నాయి.