May 24,2023 22:10

చదును చేసిన అడ్డతిప్పకొండ ప్రాంతం

        బుక్కరాయసముద్రం : 'ఎవరేమనుకుంటే మాకేమి... మాలాభం మాక్కావాలి' అన్నట్లుంది బుక్కరాయసముద్రం అధికార వైసిపి నేతల తీరు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఒక్కో నేత 6 సెంట్ల స్థలం తీసుకునేలా పక్కా స్కెచ్‌ వేశారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి పట్టాలు పొందేందుకు అన్ని ఏర్పాట్లనూ చేసుకున్నారు. ఏకంగా కొండను చదును చేసి అందులో స్థలాన్ని కాజేసేలా 'కొండ'ంత అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో అధికార పార్టీ నేతలకు అప్పన్నంగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టే కుట్ర చేస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు విన్పిస్తున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని బుక్కరాయసముద్రం సచివాలయం-4కు కూతవేటు దూరంలో ఉన్న అడ్డతిప్పకొండను తవ్వేసి, ఇందులో అధికార పార్టీ నేతలు పట్టాలు తీసుకుని కాలనీ ఏర్పాటు చేసుకునే కుట్ర జరుగుతోంది. అనంతపురం నగరం, జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి అతిసమీపాన బుక్కరాయసముద్రం మండలం ఉంది. ఇక్కడ భూములకు భారీగా ధరలు ఉన్నాయి. బికెఎస్‌ మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం, సచివాలయం-4కు కూతవేటు దూరంలో ఉన్న అడ్డతిప్పకొండను తవ్వేసి అందులో పట్టాలు తీసుకునేలా అధికార పార్టీ నేతలు పక్కా స్కెచ్‌ వేశారు. అధికార పార్టీ నియోజకవర్గ నాయకులతో కూడగలుపుకుని వైసిపి మండల నాయకులు పక్కా ప్రణాళికతో అడ్డతిప్పకొండ కింద చదును చేశారు. ఇక్కడ ఒక్కొక్క వైసిపి నాయకుడు ఆరు సెంట్లు ప్రకారం స్థలం తీసుకునేలా అధికారులపై ఒత్తిడి చేసి, రికార్డులు తయారు చేయించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేతలు చేస్తున్న ఈ పనిపై ఆ పార్టీలోని కార్యకర్తలే తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాయకులుగా చెలామణి అవుతూ ఇలా ప్రభుత్వ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకోవడం ఏమిటంటూ గుసగుసలాడుతున్నారు. అన్ని అర్హతలున్న పేదలకోమే ఒకటిన్నర సెంటు, ఖద్దర్‌ వేసుకున్న నాయకులకు ఆరు సెంట్లు ఇవ్వడం ఏమిటంటూ పలువురు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని కాజేయాలని చూస్తున్న అధికార పార్టీ నాయకులు, వారికి సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణం వీటిపై దష్టి సారించి కబ్జా కాబోతున్న కొండ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.
గతంలోనూ కొండలో మట్టిమాఫియా
        అడ్డతిప్పకొండ చుట్టూ అధికార పార్టీ నేతల చేస్తున్న అవినీతి ఇప్పటిది కాదు. గతంలోనూ ఈ కొండపై అధికార మట్టి మాఫియా కన్ను పడింది. ఏకంగా కొండ నుంచి రూ.3 కోట్ల విలువజేసే మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలించేశారు. మట్టి తవ్వకాల వల్ల పర్యావరణ సముతుల్యత ఏర్పడి, సమీప వ్యవసాయ పొలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అప్పట్లో సిపిఎం దీనిపై పోరాటం చేసింది. అధికారులను కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేసింది. అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి మట్టి తరలింపును పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు ఏకంగా కొండ ప్రాంతం స్థలాన్ని నాయకులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది.
అధికారం ముసుగులో కబ్జా
ఆర్‌.కుళ్లాయప్ప,

సిపిఎం మండలకార్యదర్శి.
         అడతిప్పకొండ చుట్లూ అధికార పార్టీ నేతలు స్థలాలను తీసుకునే ముసుగులో కబ్జాకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కొండలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా రూ.3 కోట్ల రూపాయల మట్టిని తవ్వేసింది. దీనిపై అప్పట్లోనే సిపిఎం అడ్డుకుని, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఏకంగా స్థలాన్ని కాజేసే కుట్ర జరుగుతోంది. స్థలాల మంజూరులో పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదు. నాయకుల్లో కూడా నిజమైన పేదలుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటిన్నర సెంటు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అరు సెంట్లు తీసుకోవడం సరికాదు. దీనిని అధికారులు అడ్డుకోవాలి. అడ్డతిప్పకొండలో అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి.
విచారణ జరిపిస్తాం..
మోహన్‌కుమార్‌, తహశీల్దార్‌
బుక్కరాయసముద్రం.

      అడ్డతిప్ప కొండకు సంబంధించి స్థలాల మంజూరు విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపిస్తాం. ఎవరికైనా నిబంధనల మేరకే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం.