May 14,2022 08:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ ఉద్యోగులు కొందరికే ఏప్రిల్‌ జీతాలు జమయ్యాయి. కొంతమంది ఉద్యోగుల ఖాతాల్లోనే సంస్థలు జమ చేస్తున్నాయి. విద్యుత్‌ వినియోగదారుల నుంచి వస్తున్న బిల్లులు, విద్యుత్‌ కొనుగోలు కోసం ఉంచిన డబ్బులతో ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమవుతున్నాయి. అదికూడా డిస్కమ్‌లలో పనిచేస్తున్న ఫీల్డ్‌ వర్కర్లు, పెన్షనర్ల ఖాతాల్లో మాత్రమే జమయ్యాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కం వర్కింగ్‌ ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమకాలేదు. వీరికి సోమవారం జమవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి విద్యుత్‌ సంస్థలకు రావాల్సిన బకాయిలు రాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నెలకు రూ.1000 కోట్లు రావాల్సి ఉందన్నారు.
 

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
జీతాలు చెల్లించాలని విద్యుత్‌ ఉద్యోగులు శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించారు. ట్రాన్స్‌కో, ఇపిడిసిఎల్‌, సిపిడిసిఎల్‌, ఎస్‌పిడిసిఎల్‌ పరిధిలోని అన్ని కంపెనీ, జోనల్‌, సర్కిల్‌, డివిజన్‌, జెన్‌కోలోని అన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. విజయవాడలోని విద్యుత్‌ సౌధ, సిపిడిసిఎల్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగాయి. వచ్చే నెల నుంచి మొదటి పనిదినం రోజే వేతనాలు చెల్లించాలని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలను ఉద్యోగులు గురువారం డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. జీతాల పెండింగ్‌ అంశానికి సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణపై శనివారం విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి నాయకులు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంపై జెఎసి నాయకులు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు.