Jul 26,2021 06:21

అతడు అన్నిచోట్లా
తనను తాను కుండ బద్దలు కొట్టినట్టు
వ్యక్తీకరించుకున్నాడంటే
మనం ఎన్నిసార్లు
అతడిని పగలగొట్టి వుంటామో కదా

వేల కత్తులు మొలిచిన
నేల మీద ఒంటరిగా
కొన్ని ప్రశ్నల్ని పట్టుకొని నిలబడ్డాడంటే
మనం ఎంతలా అతడిని
ముక్కలు చేసివుంటామో కదా

అతడు లేడని
నువ్వు సంబరమవుతున్నావంటే
అతడి ప్రశ్నలింకా
నీలోపల బతికున్నాయనే అర్థం కదా!

అతడి ముందూ
ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలున్నాయి
అతడి తర్వాత కూడా
ఎన్నో ప్రశ్నలు మిగిలేవుంటాయి కానీ
కాలం గోడల లోతుల్లాకంటా
అతడు దిగ్గొట్టిన
ప్రశ్నల మేకుల్ని తడుముకున్నపుడల్లా
తప్పిపోయిన వెన్నెముక
ఒక్కసారిగా ఉలిక్కిపడి
నిటారుగా నిలబడుతుంది!
- సాంబమూర్తి లండ