
కొత్తగా 4,528 మందికి కోవిడ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా నాలుగు వేలకుపైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటలలో 39,816 శ్యాంపిల్స్‌ను పరీక్షించగా, 4,528 మందికి కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్థారణైనట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శుక్రవారం బులిటెన్‌ను విడుదల చేసింది. కొత్త కేసులలో చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లోనే రెండు వేల కేసులుండటం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 20,96,755కు చేరగా, అందులో 20,63,934 కోలుకున్నారు. వీరిలో చాలా మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. చిత్తూరులో అత్యధికంగా 1,027 మందికి పాజిటివ్ నిర్థారణవ్వగా, విశాఖపట్నంలో 992, శ్రీకాకుళం 385, గుంటూరులో 377, తూర్పు గోదావరిలో 327, అనంతపురంలో 300, కడపలో 236, నెల్లూరులో 229, కృష్ణాలో 166, కర్నూలులో 164, ప్రకాశంలో 142, విజయనగరంలో 121, పశ్చిమ గోదావరిలో 62 కొత్త కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ నుంచి 418 కోలుకుగా, ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులలోనూ చిత్తూరు, విశాఖపట్నంలోనే ఏడున్నర వేలు ఉన్నాయి. ఎనిమిది జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటలలో ప్రకాశం జిల్లాలో ఒక్కరు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 14,508కు చేరింది.