May 05,2021 08:46

న్యూఢిల్లీ : కోవిడ్‌ రోగులకు చికిత్స కోసం ఢిల్లీకి ఆక్సిజన్‌ సరఫరా చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించని నేపథ్యంలో కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఈ మేరకు ఇప్పటికే ఆదేశించిందని, ఎలాగైనా సరే రోజూ 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఢిల్లీకి సరఫరా చేయాలని ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పిందని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బెంచ్‌ పేర్కొంది. ''మీరు కళ్లు మూసుకుని వుండవచ్చు, కానీ మేం అలా చేయం'' అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలకు 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం చేసిన వాదనను బెంచ్‌ తోసిపుచ్చింది. కోర్టు ధిక్కరణ అనేది చివరిగా వున్న పరిష్కారమని మేం ఇప్పటికే చెప్పి వున్నా మని, ఆ చివరి వరకు లాగవద్దని చెప్పాం. అయిందేదో అయింది. ఈ విషయంపై స్పష్టంగా వుండాలి. నో అని చెప్పడాన్ని మేం అంగీకరించబోం, మీరు సరఫరా చేయకుండా ఉండేందుకు అవకాశం లేదని బెంచ్‌ పేర్కొంది.