Sep 27,2021 13:12

అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కుమార్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన వ్యక్తులను కాకుండా న్యాయ వ్యవస్థనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం త్రిపుర సివిల్‌ సర్వీసు (టిఎస్‌సి) ఆఫీసర్లనుద్దేశించి మాట్లాడుతూ.. ' నేను పులి, కోర్టును కాదంటూ' వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతుంది. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో పనిచేయాలని, గత ప్రభుత్వంలా కాదని ఆరోపణలు చేశారు. కోర్టు ధిక్కరణ జరిగే సందర్భాల్లో తాను జోక్యం చేసుకుంటానని అన్నారు. ' నేను ఇచ్చిన ఓ నిర్థిష్ట పనిని మేం ఏం చేయలేమని చాలా మంది అధికారలు చెబుతున్నారు. కోర్టు ధిక్కరణకు గురయ్యే పనులు చేయమని చెబుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు. కోర్టు తీర్పు ఇస్తుంది. కానీ పోలీసులు దాన్ని అమలు చేయాలి. పోలీసులు నా నియంత్రణలో ఉంటారు. పోలీసులకు అనేక విధానాలున్నాయి. వారికి నేను సాక్షిని' అంటూ రవీంద్ర భవన్‌లో శనివారం జరిగిన టిసిఎస్‌ అధికారులు 26వ ద్వైవార్షిక సదస్సులో ఉన్నారు. పులిలా కోర్టుకు భయపడతారని, అయితే తాను పులినని, ప్రజలచే ఎన్నుకోబడిన తాను అధికారంలో ఉన్నానని, ప్రజలచే ఎన్నుకోబడినదే ప్రభుత్వమని, కోర్టు ద్వారా కాదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కోర్టు ఉందని, కోర్టు కోసం ప్రజలు ఉండరని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఉదాహరణనిస్తూ.. కోర్టును ధిక్కరించిన కారణంగా చీఫ్‌ సెక్రటరీ హెచ్చరికలకు గురైనప్పటికీ... ఈ సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున క్యాబినేట్‌ ద్వారా ప్రభుత్వ అధికారుల తాత్కాలిక ప్రమోషన్‌ కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.