Jun 10,2021 07:49

న్యూఢిల్లీ : కోర్టులు ప్రజలకు నైతిక విలువలు బోధించలేవని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నైకి చెందిన కార్టూనిస్టు బాలమురుగన్‌పై నమోదైన క్రిమినల్‌ పరువునష్టం కేసును కొట్టివేసింది. ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్ధించింది. తమిళనాడు సీనియర్‌ ప్రభుత్వ సిబ్బందిని అభ్యంతరకరమైన రీతిలో చూపినందుకు 2017నాటి ఈ కార్టూన్‌ వివాదాస్పదమైంది. 'భిన్నమైన వ్యక్తులు భిన్నమైన రీతుల్లో కార్టూన్లు వేస్తారు. ప్రజాస్వామ్య దేశంలో భావాలకు, వ్యక్తీకరణకు, మాట్లాడేందుకు స్వేచ్ఛ వుంటుంది. ప్రజాస్వామ్యానికి ఇవే పునాదులు. ఇవి లేనిదే ప్రజాస్వామ్యం మనలేదు. మానవ సమాజ పరిణామం జరగదని' న్యాయమూర్తి జి.ఇళంగోవన్‌ పేర్కొన్నారు. అదే రీతిలో తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ, కోర్టులు ప్రజలకు నైతిక విలువలు బోధించలేవని అన్నారు. అది చేయాల్సింది సమాజమేనన్నారు. తిరునల్వేలి జిల్లాలోని దినసరి కూలి కుటుంబం ఆత్మాహుతికి పాల్పడిన ఘటన పట్ల ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ బాలమురుగన్‌ కార్టూను వేశారు. ఆ కార్టూను సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దానిపై జిల్లా కలెక్టర్‌ చేసిన ఫిర్యాదు మేరకు బాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని బాల కూడా కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు.