
కరోనా వైరస్ కథ - 7
కోవిడ్-19 వ్యాధి కొత్తగా వచ్చింది కనుక దాన్ని నయం చేసే మందులపై చురుకుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం కోవిడ్-19 వైరస్ వ్యాధిని నయం చేసే మందులు ఇప్పటివరకు ఉత్పత్తి కాలేదు. అమెరికా ఆహారం, మందుల సంస్థ (ఎఫ్‌డిఎ) రెమిడిసివిర్ (వెంక్లురి) మందు ఒక్క దానికి అనుమతి ఇచ్చినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ దాన్ని ఆమోదించలేదు. ఎఫ్‌డిఎ కూడా కోవిడ్-19ను పూర్తిగా నయం చేస్తుందని చెప్పలేదు. 12 ఏళ్లు వయసు పైపడిన వారిలో తీవ్ర స్థాయిలో వ్యాధి ఉన్నప్పుడు అంటే ఆసుపత్రి పాలైనప్పుడు ఈ మందు వాడాలని సిఫార్సు చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో రెమిడిసివిర్ తీసుకోని వారికన్నా తీసుకున్న వారిలో వ్యాధి నుంచి కోలుకున్న వారి శాతం కొంతమేరకు పెరిగిందని తేలింది. అయితే ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఇటువంటి క్లినికల్ పరీక్షలు నిర్వహించగా రెమిడిసివిర్ తీసుకున్న వారిలోనూ, తీసుకోని వారిలోనూ 11 శాతం మరణాలు సంభవించాయని తేలింది. అందువల్ల రెమిడిసివిర్ మందు విషయంలో అభిప్రాయ బేధాలున్నాయి. వాస్తవానికి అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్) ఆసుపత్రి పాలైన అందరికీ రెమిడిసివిర్ ఇవ్వకూడదనీ, నిర్ధిష్టమైన రోగులకు మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేసింది.

మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్, క్లోరోక్విన్ మందులు కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల మీద బాగా పనిచేస్తాయని మొదట్లో పెద్ద ప్రచారం జరిగింది. కోవిడ్-19తో ఆసుపత్రిపాలైన రోగుల్లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ మందు వాడితే ఉపయోగం ఉండవచ్చునని అమెరికాలో కొన్ని చిన్న అధ్యయనాలు తొలుత చెప్పాయి. మలేరియాను అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్మూలించారు గనుక అక్కడ క్లోరోక్విన్ ఉత్పత్తి లేదు. మన దేశంలో మలేరియా మందులు పెద్దయెత్తున ఉత్పత్తి అవుతున్నాయి గనుక కోవిడ్ నిర్మూలనకు ప్రపంచానికంతటికీ మనమే క్లోరోక్విన్ సరఫరా చేస్తున్నామని, మన దేశం ప్రపంచానికి ఆరోగ్య ప్రదాయని అని కొంతమంది పెద్దయెత్తున ప్రచారం చేశారు. కానీ ఈ మందులు కోవిడ్ మీద పనిచేయబోవని అమెరికా ఆరోగ్య సంస్థలు సిఫార్సు చేయడంతో ఆ ప్రచారం అంతటితో ఆగిపోయింది. వ్యాధి తీవ్రంగా ఉన్న వారికి ప్లాస్మా థెరపీ కొంతమేరకు నయం చేస్తుందని అమెరికా ఎఫ్‌డిఎ పేర్కొంది. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనివల్ల వ్యాధి నయమవుతుందన్న దాఖలాలు లేవని చెప్పింది.
మొత్తమ్మీద ఇప్పటివరకు కోవిడ్ వ్యాధికి చికిత్సలో అందరూ అంగీకరించింది కొన్ని రకాల కార్టికోస్టిరాయిడ్స్ (డెక్సామెథాజోన్) వాడాలని మాత్రమే. అది కూడా వ్యాధి తీవ్రంగా ఉన్న వారికి తక్కువ మోతాదులో సిఫార్సు చేశారు. ''కోవిడ్-19తో తీవ్రంగా బాధపడుతున్న పేషెంట్లలోని వ్యాధినిరోధక వ్యవస్థ తరచూ తీవ్రంగా స్పందిస్తుంది (ఓవర్ రియాక్షన్). దీనివల్ల పేషెంటు ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం జరుగుతుంది. టోసిలిజుమాబ్, సరిలుమాబ్ వంటి మందులు ఈ అతిస్పందనను అణచివేస్తాయి'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వెంటిలేటర్ మీద ఉన్న కరోనా రోగులకు ఈ స్టెరాయిడ్స్ ఇస్తే మూడోవంతు మరణాలు తగ్గాయనీ, ఆక్సిజన్ మీద ఉన్నవారికి ఇస్తే అయిదో వంతు తగ్గాయని బ్రిటన్‌లో చేసిన క్లినికల్ పరీక్షల్లో తేలింది.

ఈ స్టెరాయిడ్స్‌ను వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులకు తక్కువ మోతాదులో ఇవ్వడం మినహా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరే ఇతర మందులను సిఫార్సు చేయలేదు. అయితే కోవిడ్-19 వ్యాధిని నయం చేసేందుకు అనేక మందులపైనా, మందుల కాంబినేషన్లపైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికా ఎఫ్‌డిఎ కొన్నిటికి అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. బహుళజాతి మందుల కంపెనీలకు లాభం చేకూర్చడానికే అది ఇలా చేస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పనిచేస్తాయో లేదో తెలియని ఈ మందులను విపరీతమైన ధరలకు అమ్ముకుని ఈ కంపెనీలు లాభాలు గడిస్తున్నాయి.
చికిత్సలో అశాస్త్రీయ పద్ధతులు...
స్టెరాయిడ్ల వాడకంలోగానీ, ఇతర మందుల వాడకంలోగానీ ఆసుపత్రుల్లో అనేక రకాల అశాస్త్రీయ పద్ధతులు అమలవుతుండడం వల్ల కరోనా రోగులు అటు ఆరోగ్య రీత్యా, ఆర్థికంగానూ నష్టపోతున్నారు. ఉదాహరణకు స్టెరాయిడ్లను తీవ్రమైన రోగులకు కొద్ది మోతాదుల్లో వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తే కొందరు కరోనా వచ్చిన తొలి నాళ్ల నుండే అధిక మోతాదు స్టెరాయిడ్ల వాడకం ప్రారంభిస్తున్నారు. డాక్టర్లతో నిమిత్తం లేకుండా మెడికల్ షాపుల్లోనే స్టెరాయిడ్లు కొని వాడే పరిస్థితి మన దేశంలో ఉంది. ప్రారంభ దశలో నిపుణులైన డాక్టర్లకు కూడా వ్యాధికి చికిత్స విషయంలో కొంత అవగాహనా లోపం ఉంది. కానీ రాను రాను వాటిపై అవగాహన పెరిగే కొద్దీ సరిచేసుకోవడం జరిగింది. అదే సమయంలో వైద్యం వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిన కొద్దీ చికిత్సలో శాస్త్రీయత తగ్గిపోతూ ఉంటుంది. కరోనా చికిత్స విషయంలో ఇది మనకు స్పష్టంగా కనిపించింది.

ఇంకా అశాస్త్రీయమైన విషయం ఏమంటే కోవిడ్-19కు నాటు మందులు తయారు చేశామని ప్రజలను మోసం చేయడం. అత్యంత ఆధునిక శాస్త్ర పరిశోధనా సంస్థలు కోవిడ్ మందుల తయారీకి కుస్తీపట్లు పడుతుంటేనే తేలలేదు. ఏదైనా ఒక మందు తయారైందటే సరిపోదు. దాన్ని జంతువుల మీద, రకరకాల తరగతుల ప్రజల మీద అనేక విధాలుగా పరీక్షించాలి. వచ్చిన ఫలితాలను విశ్లేషించి డేటా తయారు చేయాలి. దీన్ని ప్రముఖ సైన్సు పత్రికల్లో శాస్త్రీయ పద్ధతిలో రివ్యూ చేయాలి. ఆ డేటాను, పరిశీలించి నిపుణుల కమిటీ ఆమోదించాలి. ఇంత జరిగాక ఒక మందును వినియోగంలోకి తెస్తారు. కానీ ఇవేవీ జరక్కుండానే 'నమ్మకం' పేరుతో మందులు వినియోగంలోకి తేవడం పూర్తిగా అశాస్త్రీయం, ప్రజల ఆరోగ్యానికి నష్టదాయకం. ఇది చాలదన్నట్లు మరికొందరు ఆవుపేడ రాసుకుంటే, లేక ఆవు మూత్రం తాగితే కోవిడ్-19 దరికి చేరదని ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ ఆయుర్వేద వ్యాపారి రామ్‌దేవ్ బాబా 'కరోనిల్' పేరుతో ఒక మందును విడుదల చేస్తూ ఈ మందుతో కరోనా తగ్గిపోతుందనీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి దీనికి ఉందని ప్రచారంలో పెట్టి అమ్మకాలు సాగించారు. అయితే తాము అటువంటి అనుమతి ఏదీ ఇవ్వలేదని 'డబ్ల్యుహెచ్ఒ' ప్రకటించింది. అయినా ఆయన తగ్గకుండా శాస్త్రీయ వైద్య విధానంపైనే దాడికి దిగారు.
రేపటి సంచికలో : జాగ్రత్త, వ్యాక్సిన్ ... ఇవే ఆయుధాలు!