Jul 21,2021 18:00

న్యూఢిల్లీ : కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఏ ఒక్కరూ చనిపోయారనడానికి సరైన ఆధారాలు లేవని కేంద్రం అబద్దాలు చెబుతోందని... శివసేన నేత సంజయ్ రౌత్‌  మోడీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 'నా కస్సలు మాటలు రావడం లేదు. కేంద్రం చేసిన ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆక్సిజన్‌ కొరత కారణంగా ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఏంటీ? కేంద్రంపై కేసు నమోదు చేయాల్సిందే' అని మీడియా సమావేశంలో డిమాండ్‌ చేశారు.
ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన పెగాసస్‌ ప్రాజెక్టుపై మీడియా అడిగిన ప్రశ్నకు.. దానిలో దాయాల్సిందేమీ లేదనకున్నట్లయితే కేంద్రం ఎందుకు భయపడుతోందని సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, పార్లమెంట్‌ ప్యానల్‌ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని సంజయ్ రౌత్‌ అన్నారు. ఒకవేళ రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రతిపక్షంలో ఉన్నా ఇదే డిమాండ్‌ చేస్తారని, వాస్తవాలు వెల్లడించాలని, దాచాల్సిందేమీ లేనప్పుడు... ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో మంగళవారం కాంగ్రెస్‌ ఎంపి కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ... కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఆసుపత్రుల్లో ఎక్కువ మంది చనిపోయారా? లేక రోడ్లపై ప్రాణాలు విడిచిన వారు అధికులా? అన్న ప్రశ్నను సంధించారు. దీనిపై స్పందించిన ఆరోగ్య సహాయక శాఖ మంత్రి డా. భారతి పర్వీన్‌ పవార్‌.. ప్రాణవాయువు కొరత కారణంగా ఏ ఒక్కరూ చనిపోయినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఖచ్చితమైన నివేదికలేమీ లేవని చెప్పిన సంగతి విదితమే. అదేవిధంగా ఆరోగ్యమనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని అన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రోజువారీ కేసులను నివేదిస్తాయని తెలిపారు.