
- జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్: కోవిడ్ కేర్ సెంటర్లలో కరోనా పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కోవిడ్ కేర్ సెంటర్లలో మౌలిక వసతుల పై కోవిడ్ కేర్ సెంటర్ ల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, సున్నిపెంట, డోన్ ప్రాంతాలలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల పరిసరప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా పేషెంట్లకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు తమకు కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించాలన్నారు. మెడికల్ ఎక్విప్‌మెంట్, వెల్కమ్‌కిట్స్, బెడ్స్, ఫుడ్ అరేంజ్‌మెంట్, శానిటేషన్, ల్యాండ్ లైన్ ఫోన్ సౌకర్యం, సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ కనెక్షన్, 108 అంబులెన్స్, సెక్యూరిటీ, నీటి వసతి, ఫైర్ ఎక్విప్‌మెంట్, యోగా టీచర్, మైక్ సెట్ వంటి వసతుల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నోడల్ అధికారులకు సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్ల చుట్టుపక్కల మంచి వాతావరణం ఉండేటట్లు చూడాలన్నారు. వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది షిఫ్ట్ ప్రకారం తమకు కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించాలని వారికి ఎటువంటి సమస్యలున్నా వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు తెలియజేయా లన్నారు. ఈ సమావేశంలో డిఇఒ రంగారెడ్డి, ఎస్‌ఎస్‌ఎ పిఒ వేణుగోపాల్, ఎపిఎంఎస్‌ఐడిసి ఇఇ సదాశివరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి సూర్యనారాయణ, ప్రతాపరెడ్డి, కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, సున్నిపెంట, కోవిడ్ కేర్ సెంటర్ల నోడల్ అధికారులు వెంకటలక్ష్మి, శ్రీనివాస్ కుమార్, ప్రవీణ, నాగేశ్వరరావు, రఘునాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
కరోనా సమాచారం...
కొత్తగా నమోదైన కేసులు 85
మొత్తం కేసులు 1,25,422
కొత్తగా నమోదైన మరణాలు 0
మొత్తం మరణాలు 854
యాక్టివ్ కేసులు 1090
మొత్తం డిశ్ఛార్జీలు 1,23,498