Apr 20,2021 21:09

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : కోవిడ్‌ వైద్య సేవలకు సమాయత్తం కావాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లాలో కోవిడ్‌ పరిస్థితులపై రిమ్స్‌లో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో మొత్తం కేసులు వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, వారి ప్రస్తుత పరిస్థితి, మెరుగుపడిన వారి వివరాలు, అందుబాటులో వైద్యం, అంబులెన్సుల అందుబాటు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 1700 కోవిడ్‌ బెడ్లు, 1500 క్వారంటైన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేసులు పెరగక ముందే ముందస్తుగా జిల్లావ్యాప్తంగా కనీసం రెండు వేల కోవిడ్‌ బెడ్లు, మూడు వేల క్వారంటైన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ సమయంలో వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని, అదే స్ఫూర్తితో ఇప్పుడూ సేవలందించి ప్రాణదాతలు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్యం అందించడంలో, కోవిడ్‌ నియంత్రణలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ వైద్యం అందించాలని సూచించారు. కోవిడ్‌ కేసుల చికిత్సకు ప్రభుత్వం ప్రకటించిన ధరలకే ప్రయివేటు వైద్యం అందించాలని, అందుకు పటిష్టమైన పర్యవేక్షణ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌కు సూచించారు. ప్రజలు కోవిడ్‌ నియంత్రణకు సహకరించాలని కోరారు. మార్కెట్‌కు ఉదయం పూట విపరీతంగా జనాలు వస్తూ గుంపులుగా సంచరిస్తున్నారని, దీని ద్వారా కోవిడ్‌ వ్యాప్తి చెందే అవకాశముందన్నారు. సమావేశంలో తూర్పు కార్పొరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, కోవిడ్‌ ప్రత్యేక అధికారి కాంతిలాల్‌ దండే, జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, సీతంపేట ఐటిడిఎ పిఒ సిహెచ్‌.శ్రీధర్‌, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ ఎ.కృష్ణమూర్తి, వైద్యులు పాల్గొన్నారు.